విజయవాడ సింగ్‌నగర్ వరదలతో అతలాకుతలమైంది. ఇంకా జలదిగ్బంధంలో వందలాది కుటుంబాలు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. వాళ్లందరి చెంతకు వెళ్తూ వారి బాధలను తెలుసుకుంటూ సీఎం చంద్రబాబు అప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా ఆదేశాలిస్తున్నారు. వరదల మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఫీల్డ్‌లోకి తానే స్వయంగా వెళ్తూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. బుల్డోజర్లు ఎక్కుతున్నారు.. నీళ్లలోకి దిగుతున్నారు.. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశిస్తున్నారు.
వరద తగ్గడంతో బురద తొలగింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శానిటేషన్ పనులకి 2100మంది సిబ్బందిని నియమించారు. వందకుపైగా ఫైరింజన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పొక్లెయిన్లు, టిప్పర్లతో వేస్టేజ్‌ను తరలిస్తున్నారు. ఇవాళ ఒక్క రోజే 6లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. 8.50లక్షల వాటర్ బాటిళ్లు, 3లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్లు ప్యాకెట్లు బాధితులకు అందించారు. మొత్తం 5లక్షలమందికి భోజన ఏర్పాట్లు చేశారు. వరద బాధితులకు సాయంపై 32మంది ఐఏఎస్‌లు ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు.
విజయవాడకు బుడమేరు ప్రధాన సమస్యగా మారిందన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం బుడమేరుని ఏమాత్రం పట్టించుకోలేదని.. ఐదేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతి మునిగిపోయిందని కొంతమంది చేస్తున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కేంద్రమంత్రి అమిత్ షాను కోరామన్నారు చంద్రబాబు. విజయవాడ, అమరావతి ముంపు బారిన పడకుండా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వరద బాధితులకు సాయం పేరుతో డబ్బు డిమాండ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాధితులందరికీ న్యాయం జరుగుతుందని.. ఎవరూ ఆధైర్యపడొద్దని అభయమిచ్చారు చంద్రబాబు.