ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం – లెక్క మార్చేనా..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ఇతర పార్టీల కంటే ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ముందున్నారు. అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరింది. ఈ సమయంలో రాప్తాడు వేదికగా భారీ సిద్దం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా సీఎం జగన్ కీలక ప్రకటనలకు సిద్దమయ్యారు. అదే సమయంలో వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ అసెంబ్లీ పరిధిలోనూ అమలుకు డిసైడ్ అయ్యారు.
జగన్ కొత్త వ్యూహం : ముఖ్యమంత్రి జగన్ ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్దుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు ప్రకటించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపే ప్రామాణికంగా పోటీ చేసే అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. ఇక, ఎన్నికల నిర్వహణ పైన ఫోకస్ చేసారు. నియోజకవర్గంల ఇప్పటికే పార్టీ పరిశీలకులతో పాటుగా ప్రతీ వార్డులోనూ కన్వీనర్లను నియమించారు. ఇక, ఇప్పుడు ప్రతీ పోలింగ్ బూత్ స్థాయిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో 15 మందితో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తగా ఉన్న దాదాపు 47 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతీ సీటు – ప్రతీ ఓటు : ఈ కమిటీల్లో స్థానికంగా పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కోసం పని చేస్తున్న వారికి సామాజిక వర్గాల వారీగా, మహిళలకు అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ ఇంటితో వార్డు వాలంటీర్ తో సహా మమేకం అయ్యేలా మార్గనిర్దేశనం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు, సామాజిక న్యాయం అమలు చేస్తున్నా..పోల్ మేనేజ్మెంట్ ఎన్నికల సమయంలో కీలకం కానుంది. దీంతో..ముఖ్యమంత్రి జగన్ అప్రమత్తం అయ్యారు. కొత్త అభ్యర్దులు పెద్ద సంఖ్యలో పోటీలో ఉండటంతో..ఎక్కడా ఎన్నికలు చేయటంతో ఏ విషయంలోనూ నిర్లిప్తత ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనూ ప్రతీ ఇంటితోనూ పార్టీ కేడర్ మమేకం అయ్యేలా ఏకండా 15 మందితో స్థానికంగా ఎంపిక చేసి వారితో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
కమిటీలు – వార్ రూమ్ సిద్దం : ప్రచారంతో పాటుగా..పోలింగ్ రోజున వీరి పాత్ర కీలకంగా మారనుంది. దీనికి సంబంధించి సీఎం జగన్ రోడ్ మ్యాప్ ఖరారు చేసారు. పక్కాగా ప్రతీ పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియోజకవర్గాల్లోని పరిస్థితులను ఎప్పటికిప్పుడు సమాచారం సేకరిస్తూ..అవసరమైన మార్గనిర్దేశం చేసేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో సీనియర్లతో వార్ రూమ్ నిర్వహణకు నిర్ణయించారు. దీని ద్వారా ప్రతీ సీటు..ప్రతీ ఓటు కీలకమని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు. ఇక, రాప్తాడు సభలో సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే ఎన్నికల హామీలను ప్రకటించటం ద్వారా పై చేయి సాధించి..ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టాలని భావిస్తున్నారు. దీంతో..జగన్ నిర్ణయాల పైన ఆసక్తి కొనసాగుతోంది.