ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మానసిక ఉపశమనమే కాకుండా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుందట. తాజా పరిశోధనల్లో కాఫీ తాగేవారికి కాలేయ సంబంధిత వ్యాధులు, మరణ ప్రమాదం తక్కువ అని నిరూపించబడిందట. ఇంతకీ ఆ పరిశోధన ఫలితాలేంటో ఓ లూక్కేయండి.
కాఫీతో కాలేయ వ్యాధులకు చెక్
కాఫీ తాగడం వల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉందని ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ , ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో భాగంగా కాఫీ తరచుగా తాగేవారు కాలేయ సంబంధిత సమస్యలు తక్కువగా ఎదుర్కొన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ అధ్యయన ఫలితాలు BMC Public Health Journal లో ప్రచురించబడ్డాయి. కాఫీలో ఉండే కొన్ని సహజసిద్ధ రసాయనాలు కాలేయాన్ని రక్షించే శక్తి కలిగి ఉంటాయని పరిశోధకులు తెలిపారు.
కాలేయానికి కాఫీ తోడు?
మన శరీరంలో అతిపెద్ద జీర్ణాశయ అవయవం కాలేయం. ఇది జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కాఫీ తాగడం వల్ల కాలేయ వ్యాధుల ప్రభావం తగ్గడమే కాకుండా, కాలేయ కణ నష్టాన్ని కూడా నిరోధించగలదని తేలింది.
లక్షల మందిపై అధ్యయనం
ఈ పరిశోధన కోసం కాఫీ తాగే 4,95,585 మంది నుంచి సమాచారం సేకరించారు. వీరిని సగటున 10.7 సంవత్సరాల పాటు పరిశీలించారు. వారికి క్రానిక్ లివర్ డిసీజ్, అలాగే వారిలోకాలేయ సంబంధిత సమస్యలున్నాయా? అనే విషయం గమనించారు. విశ్లేషణలో కాఫీ తాగేవారిలో కాలేయ సంబంధిత వ్యాధుల రేటు తక్కువగా ఉన్నట్లు తేలింది.
శాస్త్రీయ ఆధారాలు
రోజూ కాఫీ తాగే వారికి కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం 21% తక్కువగా ఉండటంతో పాటు, క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల మరణించే ప్రమాదం 49% తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. కాఫీలో ఉండే కొన్ని సహజ రసాయనాలు కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడతాయని తెలిపారు.
































