విశ్వంలోని మారుమూల ప్రాంతంలో ఓ మహా బ్రహ్మాండ జలాశయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి నుంచి 1,200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న క్వాసర్(బ్లాక్ హోల్స్ కలిగిన శక్తి ఉత్పత్తి కేంద్రం) చుట్టూ ఇది తిరుగుతున్నది.
నేడు మనం చూస్తున్న కాంతి ప్రయాణం విశ్వం పుట్టిన తర్వాత కొద్ది కాలంలోనే ప్రారంభమైందని ఈ దూరాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపు ఆరు లక్షల కోట్ల మైళ్ల దూరం. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఈ జలాశయాన్ని కనుగొంది. భూమిపై గల మహా సముద్రాల్లోని నీటి మొత్తం కన్నా ఈ మహా బ్రహ్మాండ జలాశయంలోని నీరు 140 లక్షల కోట్ల రెట్లు ఎక్కువ. ఈ జలాశయం ఓ సూపర్‌మాసివ్ బ్లాక్‌హోల్ వద్ద ఉంది. ఇది సూర్యుడి కన్నా 2,000 రెట్లు పెద్దదని పరిశోధకులు తెలిపారు. ఇక్కడి నుంచి 1,000 లక్షల సూర్యులతో సమానమైన శక్తి బయటకు వస్తున్నది.
ఈ క్వాసర్ వద్ద ఇప్పటి వరకు మన విశ్వంలో గుర్తించనంత భారీ, సుదూర జలాశయం ఉంది. దీనిపై అధ్యయనం చేస్తున్న బృందాల్లో ఒకదానికి మట్ బ్రాడ్‌ఫోర్డ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్వాసర్ చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రత్యేకమైనదని ఆయన చెప్పారు. ఇది పెద్ద ఎత్తున నీటిని ఉత్పత్తి చేస్తున్నదన్నారు. ఈ క్వాసర్‌లో నీటి ఆవిరి వందల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉందన్నారు. విశ్వంలో అంతటా నీరు విస్తృతంగా ఉందని చెప్పడానికి ఇది మరో సంకేతమని తెలిపారు. క్వాసర్స్‌ను 50 ఏళ్ల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు. క్వాసర్స్‌ను అధ్యయనం చేయడం వల్ల ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం ప్రారంభం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. పాలపుంతలు, నక్షత్రాల పరిణామానికి రూపం ఇవ్వడంలో నీటి పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన వివరించారు.