టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి పని చాలా సులభం అయిపోయింది. సరుకులు కొనుగోలు చేయడం నుంచి వాటికి సంబంధించిన రిసిప్ట్లు కూడా ఆన్లైన్లోనే తీసుకోగలుగుతున్నారు. అయితే ఏదైనా షాపింగ్ మాల్ లో వస్తువులు కొనుగోలు చేస్తే కంప్యూటర్ బిల్ అందిస్తున్నారు. గతంలో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే డబ్బులు తీసుకుని వస్తువు ఇచ్చేవారు. కొందరు మాత్రమే అడిగితే రసీదు ఇచ్చేవారు. దీనిపై సరుకుల లిస్టు తో పాటు ధరలు పెన్నుతో రాసి అందించేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ బిల్ అందుబాటులోకి వచ్చింది. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసిన కంప్యూటర్ బిల్ ఇస్తున్నారు.అయితే ఈ కంప్యూటర్ బిల్ వల్ల ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏదైనా షాప్ లో వస్తువును కొనుగోలు చేసిన తర్వాత కంప్యూటర్ బిల్ అందిస్తున్నారు. అయితే ఈ బిల్లును చేతిలో పట్టుకొని ఎంత ధర ఉంది? ఎంత ఖర్చు అయింది? అనే విషయాలను పరిశీలిస్తూ ఉంటాం. అలా కొన్ని నిమిషాల పాటు చేతితోనే పట్టుకుంటూ ఉంటాం. కానీ ఇలా చేతితో ఈ బిల్ పట్టుకోవడం వల్ల పురుషులకు ఆరోగ్య సమస్యలు వస్తాయని స్పెయిన్ లోని ఓ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ యూనివర్సిటీ వెల్లడించిన పరిశోధనలు ఎలా ఉన్నాయంటే?
స్పెయిన్ లోని గ్రెనడా యూనివర్సిటీ తాజాగా చేసిన పరిశోధనలు పురుషులకు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఎందుకంటే షాపింగ్ మాల్ లో ఇచ్చే కంప్యూటర్ బిల్ తో పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి అడ్డు ఉంటుందని.. దీంతో వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు చెప్పారు. కంప్యూటర్ బిల్ ఏదైనా 10 సెకండ్ల పాటు చేతితో పట్టుకుంటే ఈ సమస్యలు ఉంటాయని అంటున్నారు. కంప్యూటర్ బిల్ పై బిన్ పెనాల్ అనే రసాయనాలతో చేసే థర్మల్ ఉంటుంది. దీనిని 10 సెకండ్ల పాటు చేతితో పట్టుకుంటే చర్మం ద్వారా ఆ రసాయనం శరీరంలోకి వెళ్తుందని పరిశోధకులు తెలిపారు. ఇవి శరీరంలోకి వెళ్లిన తర్వాత ముఖ్యంగా పురుషుల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో సంతాన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు..
ప్రస్తుత కాలంలో చాలామంది కంప్యూటర్ బిల్ పొందుతున్నారు. చిన్న షాపుల్లో కూడా కంప్యూటర్ బిల్లును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ రసీదుతో ఒకరకంగా ప్రయోజనమే అయినా.. ఆరోగ్యపరంగా మాత్రం నష్టాలే అని అంటున్నారు. అయితే ఒకవేళ కంప్యూటర్ బిల్ తీసుకునే సమయంలో చేతిలో వేరే వస్త్రాన్ని పట్టుకొని తీసుకోవాలి. లేదా కంప్యూటర్ బిల్ ప్రింట్ అయిన తర్వాత కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంతవరకు నష్టం తగ్గే అవకాశం ఉంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే చాలా సందర్భాల్లో కొన్ని షాపింగ్ మాల్ లో ఒకటికి మించి బిల్లులు ఇస్తుంటారు. ఇలాంటి సందర్భంలో చేతితో తీసుకెళ్లిన సంచిలో వేయమని గాని లేదా ఇతర మార్గాలు కానీ ఆలోచించాలని చెబుతున్నారు.
































