జగన్ అడుగులపై కాంగ్రెస్ అలర్ట్ – బిగ్ గేమ్, షర్మిల “ఫిక్స్”..!!

ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ చేరుతోంది.


దీంతో.. అటు ఢిల్లీ నుంచి అమరావతి వరకు చోటు చేసుకుంటున్న సమీకరణాల పైన కాంగ్రెస్ ఫోకస్ చేసింది. జగన్ ఓటమి తరువాత తీసుకుంటున్న నిర్ణయాలపైన ఆరా తీస్తోంది. ఇదే సమయంలో షర్మిల విషయం లో హైకమాండ్ అలర్ట్ అయింది. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

మారుతున్న లెక్కలు

జాతీయ స్థాయిలో సంకీర్ణ కూటమి ఎన్డీఏ కొలువు తీరింది. రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. వైసీపీ ఓటమిలో పీసీసీ చీఫ్ షర్మిల కీలక పాత్ర పోషించారు. తాను కడప ఎంపీగా ఓడిపోయారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన షర్మిల ఏపికి రావాల్సిన పెండింగ్ హామీల అమలు పైన ఫోకస్ చేయాలని సూచించారు. ఇటు జగన్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదని..ప్రజల పక్షాన నిలబడదామని సూచిస్తున్నారు. అటు ఢిల్లీలోనూ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి

ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీ(యూ) కీలకంగా మారాయి. నెంబర్ గేమ్ ఏ రోజు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అటు ఇండియా కూటమి సమయం కోసం వేచి చూస్తోంది. ఎన్డీఏ, ఇండియా కూటమి కి మద్దతు ఇవ్వకండా తటస్థంగా నిలిచిన పార్టీల పైన రెండు కూటములు ఫోకస్ చేసాయి. సంఖ్య ఏ స్థాయిలో ఉన్నా ప్రతీ పార్టీ కీలకంగా మారుతోంది. జగన్ ప్రత్యర్ధి చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో ఉండటంతో జగన్ అటు వైపు వెళ్లే అవకాశం లేదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అదే సమయంలో జగన్ ఇటు కాంగ్రెస్ ఉన్న కూటమి వైపు వెళ్లే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. జగన్ తటస్థ వైఖరిలోనే ఉంటారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

భవిష్యత్ ప్రణాళికలు

ఇక, ఏపీలో జగన్ భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా దీటైన వ్యూహంతో వెళ్తే…రాష్ట్రంలో బలపడటానికి ఇదే సరైన సమయంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా షర్మిలకు పార్టీలో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో షర్మిలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సభ్యురాలిగా చేయాలని నిర్ణయించారు. జగన్ పార్టీ నుంచి బీజేపీ, టీడీపీలోకి వెళ్లేందుకు ఇష్టపడని వారికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీగా నిలిచేలా కార్యాచరణ ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ తీసుకొనే నిర్ణయాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.