గెలుపు వాకిట బోర్లాపడ్డ కాంగ్రెస్.. ఆ పార్టీ కొంప ముంచిన కారణాలివే

www.mannamweb.com


హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలే నిజమవుతాయన్న ధీమాతో ఓట్ల లెక్కింపు ప్రారంభించడంతోనే సంబరాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభాసుపాలైంది.

ఇప్పటికీ ఓటమిని అంగీకరించకుండా కేంద్ర ఎన్నికల సంఘంపై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఓవైపు సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, జాట్ సామాజికవర్గంలో నెలకొన్న ఆగ్రహం, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన క్రీడాకారుల్లో కొందరు రాజకీయా ఆరంగేట్రం చేసి కాంగ్రెస్‌ పక్షాన నిలబడడం, రైతు ఆందోళనలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం, అగ్నివీర్ పథకంపై అసంతృప్తి వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీని బలమైన ప్రత్యర్థి ఎవరైనా సునాయాసంగా ఓడించవచ్చు. అయితే అలా వ్యతిరేకించే వర్గాలను ఆకట్టుకుని, వారిలో నమ్మకాన్ని కల్గించగల్గితేనే విజయం సిద్ధిస్తుంది.

ఎగ్జిట్ పోల్ అంచనాల కంటే ముందు నుంచే హర్యానాలో అధికారపక్ష వ్యతిరేక వాతావరణం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయదగ్గ వర్గాలైన కిసాన్ (రైతులు), నవ్‌జవాన్ (యువత), పహిల్వాన్ (రెజ్లర్లు) బాహాటంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తరహా నెరేటివ్ (కథనం)ను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీయే గెలుపొందాలి. కానీ అలా జరగలేదు. విజయం వాకిట గ్రాండ్ ఓల్డ్ పార్టీ బొక్కబోర్లా పడింది. ఇందుకు దారితీసిన కారణాల్లో కాంగ్రెస్ స్వయంకృతాపరాథాలే ఎక్కువ.