1946 డిసెంబరు 6న రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం జరిగింది. ఎన్నికైన ప్రముఖుల్లో జవహర్‌లాల్ నెహ్రూ (భారత జాతీయ కాంగ్రెస్), బాబూ జగ్జీవన్‌రామ్ (కార్మిక వర్గం), మహమ్మద్ అలీ జిన్నా (ముస్లింలీగ్), డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ (షెడ్యూల్డ్ కులాలు), శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ఎం.ఆర్.జయకర్ (హిందూ మహాసభ), సర్వేపల్లి రాధాకృష్ణన్, సరోజిని నాయుడు తదితరులున్నారు.
తెలుగు నేతల్లో టంగుటూరు ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, కళా వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎస్.జి.రంగా, బొబ్బిలి రామకృష్ణ రంగారావు ఎన్నికయ్యారు.
రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడింది. దీనికి అంబేడ్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంట్లో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రధాన కమిటీతోపాటు, కొన్ని ఉపకమిటీలు ఏర్పడ్డాయి.
అవిభాజ్య భారత రాజ్యాంగ పరిషత్(సభ)లో మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో బ్రిటిష్-ఇండియాలోని 11 గవర్నర్ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది ఎన్నికయ్యారు. చీఫ్ కమిషనర్ పాలిత ప్రాంతాల నుంచి (దిల్లీ, అజ్మీర్-మేవార్, కూర్గ్, బ్రిటిష్ బలూచిస్థాన్) నుంచి నలుగురు సభ్యులు, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది నియమితులయ్యారు. తర్వాత ముస్లిం లీగ్ సభ నుంచి వైదొలగడంతో రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. ఇందులో బ్రిటిష్ ఇండియా పాలిత ప్రాంతాలకు 229, స్వదేశీ సంస్థానాలకు 70 మంది ప్రాతినిధ్యం వహించారు.
15 మంది మహిళలు రాజ్యాంగ సభలో తమ వాదన వినిపించారు. ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) అధికారి సర్ బెనగళ్ నర్సింగరావు సభకు సలహాదారుగా నియమితులయ్యారు. రాజ్యాంగ రచన కమిటీలోనూ సభ్యులయ్యారు.