ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్ 2024 ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్ గంగాధర్ అక్టోబరు 14న షెడ్యూల్ విడుదల చేశారు. లాసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులంతా ఈ కౌన్సెలింగ్ పాల్గొనాలని ఆయన సూచించారు. లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు 16 నుంచి 20 లోపు కౌన్సెలింగ్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ చెప్పారు. అక్టోబర్ 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలలు ఎంపిక చేసుకోవాలని, అక్టోబర్ 26న మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 28న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు 29, 30 తేదీల్లో ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలాల్లో ప్రవేశాలకు సంబంధించి లాసెట్ 2024 నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 27వ తేదీన ఫలితాలు విడుదలైనప్పటికీ ఇప్పటి వరకూ కౌన్సెలింగ్ ప్రారంభించలేదు. గతేడాది కూడా లాసెట్ కౌన్సెలింగ్ నవంబర్‌లో ప్రారంభమైంది. ఆ ప్రకారంగా చూస్తే ఈసారి అక్టోబర్‌లోనే నిర్వహించడం కొంత ఊరటకలిగించే విషయమే. కాగా ఏపీ లాసెట్‌ను 19,224 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో 17,117 మంది ఉత్తీర్ణత సాధించారు. సాధారణంగా లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించాలంటే ఆయా కాలేజీలకు బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొన్ని కాలేజీల అనుమతుల ప్రక్రియ కొనసాగడంతో షెడ్యూల్ విడుదలలో కొంత జాప్యం జరిగింది. మరోవైపు తెలంగాణలో లాసెట్ ప్రవేశాల ప్రక్రియ దాదాపు పూర్తైందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతోందక్కడ.
పాఠశాల విద్యార్ధులకు ‘ప్రతిభ’ పరీక్ష నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10వ తరగతుల విద్యార్థులకు ప్రతీయేట ఎపిఫనీ సంస్థ నిర్వహించే ప్రతిభ అవార్డుల పరీక్ష ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రకటనను పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు అక్టోబరు 14న విడుదల చేశారు. కోడ్‌తంత్ర సాంకేతికత సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. క్వశ్చన్ పేపర్ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో 40 శాతం పైగా మార్కులు సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో ప్రథమ స్థానం పొందిన వారికి రూ.30 వేలు, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి వరుసగా రూ.25 వేలు, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి ఇస్తారు. ఏడో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల చొప్పున అందజేస్తారు.