క్షణికావేశానికి దంపతుల బలి..అనాథలుగా మిగిలిన చిన్నారులు

www.mannamweb.com


క్షణికావేశంలో దంపతులు తీసుకున్న అర్థరహిత నిర్ణయానికి ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు రోడ్డున పడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకొని.. ఐదేళ్లు కలిసి జీవించిన ఓ యువ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలతో ఆత్మహత్య చేసుకొని ఇద్దరు చిన్నారులను ఆనాథలుగా మిగిల్చారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సిఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన కీర్తి (26), మియాపూర్‌కు చెందిన సందీప్ (30) ఐదేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వృత్తి రీత్యా ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధంకొమ్ము శ్రీధం హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి 3 సంవత్సరాల పాప, 14 నెలల బాబు ఉన్నారు. కొన్నేళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో ఇటీవల మనస్పర్ధలు వచ్చాయి.

ఈ క్రమంలో మియాపూర్‌లో ఉండే పేరెంట్స్ దగ్గర పిల్లలను దించి వస్తానని సందీప్ ఆదివారం సాయంత్రం వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. గమనించిన సందీప్ కూడా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం వరకు సందీప్, కీర్తి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బంధువులు ఇంటికి వెళ్లి చూడగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే సందీప్ తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందిచడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ కలహాలతోనే ఇద్దరు ప్రాణాలు తీసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.