హాట్ టాపిక్ : జగన్‌ పై కేసులన్నీ ఆపేసిన కోర్టు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి జగన్‌ వాహనం కింద పడి మరణించాడు.


అయితే ఈవిషయం ఘటన జరిగిన నాలుగు రోజులు తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జగన్‌ను ఏ2గా చేర్చారు. అయితే దీనిపై జగన్‌ ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపిపై విచారణ జరిపిన కోర్టు అనూహ్యంగా తదుపరి చర్యలన్నీ నిలిపివేసింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Jagan Cases ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్న రోడ్‌షోలో జరిగిన ఒక విషాదకర సంఘటన, చట్టపరమైన వివాదంగా మారింది. పల్నాడు జిల్లాలోని రెంటపల్ల గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త సి. సింగయ్య మరణించాడు. ఈ కేసులో జగన్‌ను రెండవ నిందితుడిగా చేర్చడం, రాజకీయ ఉద్దేశాలతో కూడిన చర్యగా విమర్శలు రేకెత్తించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకొని, రెండు వారాల పాటు విచారణను నిలిపివేసింది.

ఆరోజు ఏం జరిగింది..
జూన్‌ 18న, పల్నాడు జిల్లాలో జగన్‌ రోడ్‌షో సందర్భంగా, ఒక వాహనం సింగయ్యను ఢీకొనడంతో అతను మరణించాడు. ప్రారంభంగా, ఈ సంఘటనను భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 106 కింద నిర్లక్ష్యపూరిత వాహన నడవడికగా నమోదు చేశారు. అయితే, తర్వాత ఈ కేసును సెక్షన్‌ 105 కింద హత్యకు సమానమైన నేరంగా మార్చారు, ఇందులో డ్రైవర్‌ను ఏ1గా, జగన్‌ను ఏ2 నిందితుడిగా చేర్చారు. ఈ మార్పు రాజకీయ ఒత్తిడి ఫలితంగా జరిగినట్లు జగన్‌ వాదించారు.

హైకోర్టు జోక్యం
జగన్, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి, ఇతర మాజీ మంత్రులు ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వారి వాదనలో, ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, నేర బాధ్యతను వాహనంలోని ప్రయాణీకులపై మోపడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. జస్టిస్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు బెంచ్, ప్రయాణీకులపై నేర ఆరోపణలు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఫలితంగా, కోర్టు రెండు వారాల పాటు విచారణను నిలిపివేసి, పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

తదుపరి చర్యలన్నీ నిలిపివేత..
తాజాగా మంగళవారం(జూలై 1న) విచారణ జరిపిన న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డి ఇరు పక్షాల వాదనలు విన్నారు. ఈ కేసు రాజకీయ ఉద్దేశాలతో నమోదు చేయబడిందని జగన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ తంబలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ తమ వద్ద ఆధారాలు ఉన్నాయిని, సమర్పించేందుకు గడువు కావాలని కోరారు. ఈ క్రమంలో జడ్జి శ్రీనివాస్‌రెడ్డి ఆశ్చర్యకరంగా, విచక్షణాధికారాలు ఉపయోగించి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ఏజీ ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా న్యాయమూర్తి ఉత్తర్వుల వెనుక ఆంతర్యం ఏమిటన్న చర్చ ఏపీలో జరుగుతోంది.

జగన్‌ హయాంలో న్యాయమూర్తిగా..
వాస్తవంగా ఈ బెంచ్‌లో ఉండాల్సిన న్యాయమూర్తి జూలై 7 వరకు సెలవులో ఉన్నారు. దీంతో కె.శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జిగా బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జస్టిస్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ స్టేట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2022, ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ అంశం కూడా ఇప్పుడు ప్రస్తావనాంశంగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.