Credit card ల బిల్లు భారమై నావికాదళ ఉద్యోగి ఆత్మహత్య

ఆత్మహత్యకు పాల్పడిన సంతోశ్‌


ఐఎన్‌ఎస్‌ కళింగ(గ్రామీణ భీమిలి), న్యూస్‌టుడే: భీమిలి మండలం ఐఎన్‌ఎస్‌ కళింగలో మల్టీ టాస్కింగు స్టాఫ్‌ (ఎంటీఎస్‌)గా విధులను నిర్వహిస్తున్న సిరుమళ్ల సంతోశ్‌ (26) గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.

జీవీఎంసీ నాల్గోవార్డు పరిధి కాపులుప్పాడ జగనన్న కాలనీలో తాను అద్దెకి నివాసముంటున్న ఇంటి గదిలోనే ఫ్యాన్‌కి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు, నావికాదళ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాజువాక సమీపంలోని శ్రీహరిపురానికి చెందిన అచ్చియ్మమ్మ, సూరిబాబుల కుమారుడైన సంతోశ్‌కి నాలుగేళ్ల కిందట ఐఎన్‌ఎస్‌ కళింగలో ఎంటీఎస్‌లో దోబీగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ ప్రాంతం దూరం కావడంతో నగరంలోని చినవాల్తేరులో ఉండే తన అక్క దివ్య ఇంటి నుంచి బైక్‌పై రాకపోకలు సాగించేవాడు.

ఈ ప్రాంతం కూడా దూరం కావడంతో ఐఎన్‌ఎస్‌ కళింగకు ఆరు కిలోమీటర్ల దూరంలోని కాపులుప్పాడ వైస్సాఆర్‌ జగనన్నకాలనీలో తన స్నేహితుడైన దుర్గా యశ్వంత్‌ సాయితో కలసి ఏడాదిన్నరగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. నగరంలోని ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న యశ్వంత్‌సాయి ఉదయం తొమ్మిదిన్నర సమయంలో రూంకి వచ్చేసరికి సంతోశ్‌ ఉరేసుకుని కనిపించాడు. వెంటనే మృతుని కుటుంబీకులకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. దోబీ పనులు చేసే మృతుని తల్లిదండ్రులు ఘటనాస్థలికి వచ్చి తమ కుమారుని ఆత్మహత్యపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అవివాహితుడైన సంతోశ్‌ క్రెడిట్‌ కార్డులను వినియోగించి దాదాపు రూ.15లక్షల నుంచి 20 లక్షల వరకూ వాడడంతో ఆ వాయిదాలను నిర్ణీత గడువులో చెల్లించలేక ఆ ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు విచారణలో ప్రాథమికంగా తెలిసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ సుధాకర్‌ తెలిపారు