గుండె బయటకు తీసి.. కాలేయాన్ని ముక్కలు చేసి

www.mannamweb.com


జర్నలిస్ట్‌ ముకేశ్‌ చంద్రకర్‌ హత్య కేసులో భయానక విషయాలు వెలుగులోకిహైదరాబాద్‌లో దాక్కున్న కీలక నిందితుడి అరెస్టు..

ఈనాడు, హైదరాబాద్, – చర్ల, న్యూస్‌టుడే: బయటకు తీసిన గుండె..

నాలుగు ముక్కలైన కాలేయం.. 15 చోట్ల పగిలిన తల.. విరిగిన పక్కటెముకలు, మెడ.. యువ జర్నలిస్టు ముకేశ్‌ చంద్రకర్‌ ఎంత దారుణంగా హత్యకు గురయ్యారనడానికి ఉదాహరణలివి. సోమవారం అతడి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు తమ కెరీర్‌లో ఇంత భయానక హత్యను చూడలేదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సురేశ్‌ చంద్రకర్‌ను సిట్‌ బృందం హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా బీజాపుర్‌కు చెందిన ముకేశ్‌ చంద్రకర్‌(28) ఓ జాతీయ ఛానల్‌కు న్యూస్‌ కంట్రిబ్యూటర్‌గా పని చేయడంతోపాటు బస్తర్‌ జంక్షన్‌ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించేవారు. ఈ క్రమంలో గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో చేపట్టిన ఓ రోడ్డు ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ గత ఏడాది డిసెంబరు 25న కథనాన్ని ప్రసారం చేశారు. అయితే అదే రోజు నుంచి అతను కనిపించకుండాపోయారు. ఆయన తమ్ముడు యుకేశ్‌ ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు జనవరి 3న కాంట్రాక్టర్‌ సురేశ్‌ చంద్రకర్‌కు చెందిన ఇంటి ఆవరణలోని సెప్టిక్‌ ట్యాంకులో ముకేశ్‌ మృతదేహాన్ని గుర్తించారు. ముకేశ్‌ వెలుగులోకి తెచ్చిన అవినీతి ప్రాజెక్టులో సురేశ్‌ భాగస్వామిగా ఉండటం, హత్య ఘటన వెలుగులోకి రాగానే పరారీకావడంతో పోలీసులు అతన్నే కీలక నిందితుడిగా భావిస్తున్నారు.

బంధువుల చేతిలోనే..!

ఈ కేసు దర్యాప్తునకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. పోలీసులు అప్పటికే ఇద్దరు నిందితులు రితీష్, దినేశ్‌ చంద్రకర్‌లను అరెస్టు చేశారు. విచారణలో వారు తెలిపిన వివరాల ప్రకారం.. రితీశ్, మహేంద్రలు జర్నలిస్టు ముకేశ్‌ను భోజనం చేద్దామని గుత్తేదారు సురేశ్‌కు చెందిన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ వాగ్వాదం చోటు చేసుకోగా వారిద్దరూ ఇనుప రాడ్డుతో కొట్టి తీవ్రంగా హింసించారు. దీంతో ముకేశ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత దినేశ్‌ అనే వ్యక్తి సహకారంతో మృతదేహాన్ని సెప్టిక్‌ ట్యాంకులో వేసి సిమెంటుతో కప్పేశారు. సురేశ్‌ ప్రణాళిక మేరకే వారు ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రితీష్, దినేశ్, సురేశ్‌లు ముకేశ్‌కు దూరపు బంధువులు కావడం గమనార్హం. తాజాగా సిట్‌ అధికారులు సురేశ్‌ హైదరాబాద్‌లోని తన డ్రైవరు ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతని భార్యనూ అదుపులోకి తీసుకున్నారు. ముకేశ్‌ హత్య ఘటనను దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ దండకారణ్యం సౌత్‌ సబ్‌జోనల్‌ అధికార ప్రతినిధి ‘సమత’ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.