మధ్యప్రదేశ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! 10నెలల క్రితం హత్యకు గురైన ఓ మహిళ మృతదేహం.. తాజాగా ఒక రూమ్‌లోని ఫ్రీడ్జ్‌లో నుంచి బయటపడింది.
ఈ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ దివాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సంజయ్ పటిదార్ అనే వ్యక్తి గతేడాది జూన్‌లో ఓ ఇంటి నుంచి మరో ఇంటికి షిప్ట్ అయ్యాడు. కానీ పాత ఇంటిలోని ఒక రూమ్‌ని ఇంకా వాడుకుంటున్నాడు. ఆ రూమ్‌కి ఎప్పుడూ లాక్ వేసే ఉంటుంది.
ఆ ఇంట్లో మరికొందరు అద్దెకు ఉంటున్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం నాటికి, లాక్ వేసిన రూమ్ నుంచి దుర్వాసన రావడం మొదలైంది. బల్వీర్ రాజ్పుట్ అనే వ్యక్తి.. రూమ్ డోర్‌ని బద్దలుకొట్టి, లోపలికి వెళ్లాడు. ఫ్రిడ్జ్ డోర్ తీసిన తర్వాత షాక్‌కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు.. ఆ రూమ్ ఫ్రిడ్జ్‌లో ఒక మహిళ మృతదేహం కనిపించింది.
“రూమ్ నుంచి దుర్వాసన వస్తోందని చెబితే వెళ్లాము. ఆ రూమ్‌లో ఒక మృతదేహం కనిపించింది,” అని దివాస్ ఎస్పీ పునీత్ గెహ్లోత్ తెలిపారు.
చనిపోయిన మహిళ పేరు ప్రతిభా పటీదార్ అని, సంజయ్ పటీదార్‌తో ఆమె లివ్-ఇన్ రిలేషన్లో ఉండేదని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆ మహిళను గతేడాది మార్చ్‌లో చంపినట్టు తెలిసిందని వివరించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సంజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి 40 కి.మీల దూరంలోని ఉజ్జెయిన్‌లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
“సంజయ్ 2024 జూన్‌లో ఇంటిని ఖాళీ చేసి, ఆ రూమ్‌ని మాత్రమే ఉంచుకున్నాడు. బల్వీర్ రాజ్పుట్ అనే వ్యక్తి ఈ ఇంట్లోకి 2024 జులైలో వచ్చాడు. అంతకుముందు, ఆ మహిళ- సంజయ్‌లు ఇక్కడ సహజీవనంలో ఉండేవారు. కాగా, మహిళ చాలా రోజులుగా కనిపించకుండాపోయిందని స్థానికులు తెలిపారు. మహిళ రెండు చేతులను కట్టేసి ఫ్రిడ్జ్‌లో పడేశాడు,” గెహ్లోత్ తెలిపారు.
పోలీసుల ప్రకారం.. మహిళతో లివ్-ఇన్‌లో ఉన్నట్టు సంజయ్ ఒప్పుకున్నాడు. ఆమెతో కలిసి 2023లో ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇరుగుపొరుగు వారికి మాత్రం, తమకు పెళ్లి జరిగిందని అబద్ధం చెప్పాడు.
కాగా, 2024 జనవరిలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకుందామని సంజయ్‌పై ప్రతిభ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దానికి అతను ఒప్పుకోలేదు. ఈ విషయంపై తరచూ గొడవ జరిగేది.
గొడవలను తట్టుకోలేకపోయిన సంజయ్.. ప్రతిభను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు వినోద్ దేవ్‌కి ఈ విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి గతేడాది మార్చ్‌లో మహిళ గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టారు.
ఆ తర్వాత గతేడాది జూన్‌లో సంజయ్ ఇంటిని ఖాళీ చేశాడు. కానీ కొన్ని వస్తువులు ఉన్నాయని, ఆ రూమ్ కీని తన దగ్గరే పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు వచ్చి రూమ్ తెరిచి చూసేవాడు.
ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.