ఈ నెల 30న సీఎస్‌ పదవీ విరమణ..! తదుపరి చీఫ్ సెక్రటరీ ఎవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ నవంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు మరో మూడు నెలల పాటు కొనసాగింపు ఇవ్వాలా లేదా అనే అంశంపై కూటమి ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. చివరికి తదుపరి సీఎస్ ఎవరనే ఉత్కంఠ తొలగింది. ఈ నెలాఖరుకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపధ్యంలో తదుపరి సీఎస్ ఎవరు అన్నదానిపై గత కొద్దిరోజులుగా చర్చలు నడిచాయి.


తాజాగా మరో మూడు నెలలు విజయానంద్ నే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వాస్తవానికి సీనియారిటీ లిస్టులో విజయానంద్ తర్వాత శ్రీలక్ష్మి, సాయి ప్రసాద్, కృష్ణబాబు, అజయ్ జైన్ ఉన్నారు. ప్రస్తుతం వీలంతా స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా కొనసాగుతున్నారు. వారిలో సాయి ప్రసాద్‌కు ప్రభుత్వ పెద్దల నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఉందని కొన్ని నెలలుగా చర్చ సాగుతోంది. అయితే 2026 మే నాటికి సాయి ప్రసాద్, జులై నాటికి కృష్ణబాబు రిటైర్ అవ్వబోతున్నారు. అయితే కృష్ణబాబు పేరును కూడా ఇదే క్రమంలో తదుపరి సీఎస్ గా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది.

తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుకు రిటైర్ అవ్వాల్సిన సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని మరింత మూడు నెలలు పొడిగించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్రానికి అధికారిక లేఖ పంపే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ పొడిగింపుతో విజయానంద్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సీఎస్‌గా కొనసాగుతారు.

1992 బ్యాచ్‌కు చెందిన విజయానంద్, 2024 డిసెంబర్ 31న సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. గత 11 నెలలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఎనర్జీ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి వస్తున్న లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులకు అవసరమైన సమన్వయం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, రాష్ట్రానికి ప్రస్తుతం ఎనర్జీ రంగంలో వస్తున్న పెట్టుబడులు గ్రౌండ్ చేయడంతో వివాదాలకు దూరంగా ఉండడంతో ప్రభుత్వం మరో మూడు నెలలు ఆయన సేవలను కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం.

1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ 1993లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. సబ్‌ కలెక్టర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఉన్నత బాధ్యతలు నిర్వహించారు. 2019-21 మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశారు. 2023 నుంచి ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా సేవలు అందించారు. ఆ తర్వాత సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.