హాట్‌కేకుల్లా సీఎస్‌ఈ సీట్లు

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి దశ కౌన్సెలింగ్‌ (ఎంసెట్‌…ఈఏపీసెట్‌) ముగిసింది. గతంలో మాదిరిగానే కంప్యూటర్‌ సైన్స్‌, ఆ తరువాత ఈసీఈలో చేరేందుకు విద్యార్థులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తొలి దశలోనే పేరొందిన కళాశాలల్లో దాదాపు 90 నుంచి 95 శాతం భర్తీ అయినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని కళాశాలల్లో 70 నుంచి 80 శాతం భర్తీ అయ్యాయంటున్నారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లకు డిమాండ్‌ కనిపించింది.


ఉమ్మడి విశాఖ జిల్లాలో 24 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 19,980 సీట్లను భర్తీ చేసుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఏ కేటగిరీకి సంబంధించి సుమారు 13,986 సీట్లు ఉండగా, తొలి దశ కౌన్సెలింగ్‌ ముగిసే నాటికి సుమారు 11,000 వరకూ భర్తీ అయినట్టు కళాశాలల ప్రతినిధులు చెబుతున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈ, ఈఈఈ బ్రాంచీల్లో అధికంగా విద్యార్థులు చేరినట్టు ప్రిన్సిపాల్స్‌ చెబుతున్నారు. గతంలో మాదిరిగానే కంప్యూటర్‌ సైన్స్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. తొలి దశలో కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చిన విద్యార్థులు చేరిపోగా, రానివారు రెండో విడత కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉన్న 605 సీట్లు అయిపోయాయి. సీట్లు అలాట్‌ అయినా ఆయా కాలేజీల్లో ఐదు నుంచి పది మంది వరకూ చేరలేదు. వారిలో జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్లు ఉన్నారు.

ఇంజనీరింగ్‌ కాలేజీ సీట్లను రెండు కేటగిరీలుగా విభజించి భర్తీచేస్తారు. ఎంసెట్‌ ర్యాంకర్లతో ఏ కేటగిరీ సీట్లను భర్తీచేస్తారు. కాలేజీకి కేటాయించిన సీట్లలో 70 శాతం సీట్లు ఏ కేటగిరీలో ఉంటాయి. మిగిలిన 30 శాతం సీట్లను ‘బి’ కేటగిరీ కింద పరిగణిస్తారు.

ఇదిలావుంటే కొందరు కోర్టును ఆశ్రయించడంతో రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. అయితే, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ఇప్పటికే చాలావరకు కాలేజీలు భర్తీ చేసుకున్నట్టు చెబుతున్నారు. అయితే, వీటిలెక్కలను అధికారులు వెల్లడించడం లేదు.

మేనేజ్‌మెంట్‌ సీటు హాట్‌ గురు..

జిల్లాలోని ప్రముఖ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు పోటీ నెలకొంది. మొదటి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌కు సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకూ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఒక ప్రముఖ కాలేజీలో అయితే రూ.ఏడు లక్షల వరకూ పలుకుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసీఈ, ఐటీ వంటి బ్రాంచీలకు ఆ నాలుగు కాలేజీల్లో సంవత్సరానికి రూ.2.2 లక్షల నుంచి రూ.3 లక్షల వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. రెండో కేటగిరీగా చెప్పుకునే కాలేజీల్లో కూడా కంప్యూటర్‌ సైన్స్‌కు ఏడాదికి రూ.1.7 లక్షల నుంచి నుంచి రూ.2 లక్షల వరకూ, మిగిలిన బ్రాంచీలకు రూ.లక్షన్నర వసూలు చేస్తున్నారు. ప్రముఖ కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈ, ఐటీ వంటి కోర్సుల్లో సీట్లు అయిపోయాయి. రెండు, మూడు కేటగిరీలకు చెందిన కాలేజీల్లో మిగిలిన బ్రాంచీల్లో సీట్ల కోసం రూ.80 వేలు నుంచి లక్ష రూపాయలు వరకూ వసూలు చేస్తున్నారు. అయితే, ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.