హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేరుతో ఒక బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచేందుకు సంబంధిత వివరాలు, కార్డు నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడిగాడు.
అనంతరం బాధితుడికి వాట్సాప్ ద్వారా ఒక APK ఫైల్ పంపించారు. బాధితుడు ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే, అతని మొబైల్ ఫోన్ మాల్వేర్ ద్వారా హ్యాక్ చేయబడింది. ఫలితంగా, బాధితుడు ఎటువంటి ఓటీపీని అందించకపోయినా, అతని హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నుండి రూ.2,91,726 మొత్తం మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా డెబిట్ అయ్యాయి.
బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ యూనిట్, హైదరాబాద్ NCRP టీమ్ ఈ ఘటనపై చర్యలు తీసుకొని బాధితుడి మొబైల్ ఫోన్ నుండి మాల్వేర్‌ను తొలగించారు. లావాదేవీలు యామజాన్ ద్వారా జరిగినట్లు గుర్తించారు. బాధితుడు నవంబర్ 2, 2024న ఆన్‌లైన్‌లో సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసాడు. సంబంధిత అధికారులకు నోటీసులు పంపించి, నిధులను బ్లాక్ చేయించారు.
NCRP టీమ్ తీసుకున్న తక్షణ చర్యలతో కోర్టు ఆదేశం లేకుండానే రూ.2,91,726 మొత్తంను వ్యాపారి బాధితుడి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌కు తిరిగి చెల్లించాడు. ఈ సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ NCRP టీమ్‌ను అభినందించారు.
వాట్సాప్ లేదా ఇతర మెసేజ్‌ల ద్వారా పంపే ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయకండి. ఈ ఫైళ్ల ద్వారా ఫ్రాడ్‌స్టర్లు మీ పర్సనల్ డేటాను చోరి చేయవచ్చు.
మీ KYC డాక్యుమెంట్లు అప్‌డేట్ చేయాలి లేదా వెరిఫై చేయాలి అని చెప్పే ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించవద్దు.
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, డెబిట్ కార్డ్ నంబర్, పిన్, CVV, OTP వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.
పై వివరాలను మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కూడా పంచుకోవద్దు.
మీకు సంబంధించి నిజమైన సందేహాలు ఉంటే, మీ బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థను ప్రత్యక్షంగా సందర్శించడం మంచిది.
సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే ఫిర్యాదు చేస్తే, మీ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.