రాజకీయాలపై దగ్గుబాటి హాట్ కామెంట్స్

www.mannamweb.com


మాజీమంత్రి, సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు కాస్ట్లీ అయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టాలని, గెలిచిన తర్వాత కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని వివరించారు. ప్రస్తుత రాజకీయాలు వేరు అని గుర్తుచేశారు. ఆయన ఈ రోజు బాపట్లలో మీడియాతో మాట్లాడారు.

అదృష్టవంతుడిని..

ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయకుండా ఉండి అదృష్టవంతుడిని అయ్యానని దగ్గబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పోటీ చేయనందుకు తనకు ఏ మాత్రం బాధ లేదని వివరించారు. రాజకీయాల నుంచి తృప్తిగా రిటైర్ అయ్యాననే భావన ఉందన్నారు. లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం రూ.20 కోట్లు కావాలని వెంకటేశ్వర రావు గుర్తుచేశారు. ఒకవేళ గెలిస్తే మరో రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలంటే రూ.50 కోట్లు చేతిలో ఉంచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఇలా ఉండేవి కాదని వెంకటేశ్వర రావు అభిప్రాయ పడ్డారు.

ఉద్యోగాలు లేవు..

రాజకీయాలే కాదు ఉద్యోగాల గురించి వెంకటేశ్వర రావు మాట్లాడారు. గతంలో ఉద్యోగాలు సులభంగా వచ్చేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని వివరించారు. చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. 1985లో ఉద్యోగాలు ఈజీగా వచ్చేవని వెంకటేశ్వర రావు గుర్తుచేశారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వెంకటేశ్వర రావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సతీమణి పురందేశ్వరి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.