ప్రాణాలు తీస్తున్న డేంజర్ సాల్ట్.. మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది చనిపోతున్నారట..

www.mannamweb.com


ఉప్పు చేసే మేలు కంటే.. కీడే ఎక్కువ.. అందుకే.. ఉప్పు ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతోందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తంచేసింది.. వాస్తవానికి డబ్ల్యూహెచ్ఓ తరచుగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సిఫార్సులను జారీ చేస్తుంది.

ఏ వ్యాధి నుంచి జాగ్రత్తగా ఉండాలి? ఏ వ్యాధి తీవ్రమైనది.. ఏది కాదు అనే సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ అందిస్తుంది.. ఇది కాకుండా, పౌరులు ఎలాంటి ఆహారాలు తినాలి.. ఏమి తినకూడదు అనే సమాచారాన్ని కూడా తరచుగా అందిస్తుంది. ఈ సమయంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉప్పు గురించి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తినే వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉప్పు తినే వ్యక్తులకు ఏమి జరిగింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు ఈ సమాచారాన్ని వెల్లడించింది.. ఉప్పు ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుంది.. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ హెచ్చరిక చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఐరోపాలో ప్రతిరోజూ కనీసం 10,000 మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. అంటే ఏటా 40 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారన్నమాట.. అంటే యూరప్‌లోని మొత్తం మరణాలలో 40 శాతం గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయి.

9 లక్షల మరణాలను నివారించవచ్చు..

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.. ఉప్పు తీసుకోవడం తగ్గించడం ద్వారా ఈ సంఖ్యను తగ్గించవచ్చు. రోజూ తీసుకునే ఉప్పులో కనీసం 25 శాతం తగ్గించాలి. అలా జరిగితే 2030 నాటికి 9 లక్షల మరణాలను అరికట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే తెలిపారు.

ఒక టీస్పూన్ ఉప్పు సరిపోతుంది

ఐరోపాలో 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఉప్పు.. ఐరోపాలో, 53 దేశాలలో 51 దేశాలు రోజువారీ ఉప్పును 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 గ్రాముల ఉప్పు లేదా అంతకంటే తక్కువ తినాలని సిఫార్సు చేస్తోంది. అంటే, ఒక టీస్పూన్ లేదా అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడం మంచిది. కానీ ఐరోపాలో దీనిని విస్మరించి ఎక్కువగా వినియోగిస్తున్నారు.. యూరోపియన్లు ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. వీటిలో అత్యధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. అందుకని ఈ ఆహారాలు తినడం మానుకోవాలని సూచించింది.

చనిపోయినవారిలో మగవారే ఎక్కువ

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది. క్రమంగా గుండెపోటు రావచ్చని ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచంలోనే అత్యధిక రక్తపోటు రోగులు యూరప్‌లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. గుండె జబ్బుల వల్ల మహిళల కంటే పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. ఈ నిష్పత్తి 2.5 గా ఉన్నట్లు పేర్కొంది.

ఉప్పు తినడం ప్రమాదకరం..

30 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు పశ్చిమ ఐరోపాలో కంటే తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఐదు శాతం ఎక్కువ. ఉప్పు తినడం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ గణాంకాలు ఐరోపాకు చెందినవే అయినప్పటికీ.. ఏ దేశంలోనైనా ఎవరైనా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, వారు గుండె జబ్బులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల ఉప్పును మితంగా తినాలని ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.