Date Palm Farming: కరువు సీమలో ఖర్జూరం సాగు

  • రైతుగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రామాంజనేయులు
  • 2.5 ఎకరాలు.. 280 మొక్కలు.. రూ.14 లక్షల పెట్టుబడి
  • నాటిన నాలుగేళ్లకు తొలి కాపు వచ్చిన ఎడారి పంట
  • ఒకసారి పెట్టుబడి పెడితే 50 ఏళ్ల పాటు ఫలసాయం
  • ఎనిమిదేళ్లకు పూర్తిస్థాయి దిగుబడులకు అవకాశం
  • కనుచూపు మేర ఇసుక తిన్నెలు.. కిలోమీటర్ల దూరం వెళ్తే తప్ప కనిపించని నీటి జాడలు… ఇటువంటి దట్టమైన ఎడారి నేలల్లో ఏపుగా పెరిగే ఖర్జూరం చెట్లు ఇప్పుడు కరువు సీమలో కనువిందు చేస్తున్నాయి. ఈ పంటను ఇక్కడ సాగు చేయడం సాహసమే అయినా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన జి.రామాంజనేయులు పట్టుదలతో ఆ దిశగా అడుగులు వేసి ఫలితం సాధించారు. ఖర్జూరం సాగు కోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. కంటి మీద కునుకు లేకుండా నాలుగేళ్లు శ్రమించిన తర్వాత తొలి కాపు అందుకున్నారు. ఆశించిన దానికంటే నాణ్యమైన దిగుబడి రావడంతో ఇప్పటివరకూ పడిన కష్టం దూదిపింజెలా ఎగిరిపోయిందని సంతోషంగా చెబుతున్నారు.

    పురిటి బిడ్డల్లా చూసుకోవాలి

    ఖర్జూరం సాగుకు ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోతుందని భావించానని, కానీ రంగంలోకి దిగాక సమస్యలు తెలిసివచ్చాయని రామాంజనేయులు వివరించారు. నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు భరిస్తూ, అతి జాగ్రత్తగా కాపాడుకుంటే తప్ప ఈ చెట్లు దక్కవని అనుభవపూర్వకంగా తెలిసిందన్నారు. ”ఖర్జూరం మొక్కలు కొనుగోలు చేయడంతో పని అయిపోదు. వాటిని కంటికి రెప్పలా కాపాడాలి. ప్రతినెల, నెలన్నరకోసారి మోనోక్రోటోఫాస్‌/ క్లోరీపైరిఫాస్‌/ సైఫర్‌ మైత్రిన్‌-ఈసీ 25 మందు చల్లాలి. మొవ్వను, కాండాన్ని తొలిచేసి లోపల గుడ్లను పెట్టే పేడపురుగు, రెడ్‌ పాం వీవిల్‌ (ఎర్ర ముక్కు పురుగు)ను గుర్తించకపోతే చెట్టు నాశనమైపోతుంది. పూత పూసినప్పుడు మనుషులను పెట్టి ఆడ, మగ పూలతో మ్యాన్యువల్‌గా పాలినేషన్‌ (పరాగ సంపర్కం) చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. చెట్లు పెరిగితే కూలీల ఖర్చు మరింత పెరుగుతుంది. మూడు, నాలుగు విడతల్లో పక్షానికోసారి పూత వచ్చినప్పుడల్లా ఈ ప్రక్రియను చేపట్టాలి. పూత వచ్చిన 48గంటల్లో పాలినేషన్‌ చేయకపోతే పిందెలు కాయవు. పిందెలు కాసినప్పటి నుంచి గుత్తులకు దోమతెర కట్టి, దానిపైన సంచులు చుట్టి కాపాడుకోవాలి. రైతు స్వయంగా పర్యవేక్షించకుండా.. కూలీలపై వదిలేస్తే పెట్టిన పెట్టుబడి నష్టపోక తప్పదు” అని రామాజనేయులు హెచ్చరించారు. ”సాగు మొదలుపెట్టిన నాలుగేళ్లకు.. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకూ తొలి కాపు వచ్చింది. మొత్తమ్మీద 3.5 టన్నుల దిగుబడి వస్తే.. టన్ను రూ.లక్ష లెక్కన విక్రయించాం. 8ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి దిగుబడులు వచ్చేవరకూ, ఆ తర్వాతా ఖర్జూరం చెట్లను పురిటి బిడ్డల్లా చూసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

    ప్రభుత్వం సాయం అందించాలి

    ఖర్జూరం పంట హార్టికల్చర్‌ జాబితాలో లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. కనీ సం సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు కూడా ఇవ్వడంలేదు. ఎండలు ఎక్కువ, వర్షపాతం తక్కువ ఉన్న అనంతపురం జిల్లాలో ఖర్జూరం సాగుకు అనువైన వాతావరణం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి. ప్లాంట్లు, డ్రిప్‌ పరికరాలతో పాటు పెట్టుబడి వ్యయంలో సబ్సిడీ ఇస్తే రైతులు ఖర్జూరం సాగుకు ముందుకొస్తారు.’ అని రామాంజనేయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • యూట్యూబ్‌ వీడియోలతో ప్రేరణ

    హైదరాబాద్‌లో మూడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన రామాంజనేయులు… యూట్యూబ్‌ వీడియోలు చూసి ఖర్జూరం సాగుపై ఆసక్తిని పెంచుకున్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే దాదాపు 50ఏళ్ల పాటు ఫలసాయం లభిస్తుందని తెలుసుకొని భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. గుంతకల్లు మండలంలోని ఎన్‌.నరసాపురం గ్రామం వద్ద తన తండ్రి పేరిట ఉన్న 5 ఎకరాల పొలంలోని కొంతభాగంలో సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. నార్పల మండలం ఏకపాదంపల్లికి చెందిన సుధీర్‌నాయుడు ఖర్జూరం సాగుచేసి లాభాలు పొందుతున్నారని తెలుసుకొని, అక్కడికి వెళ్లి చూసివచ్చారు. కోయంబత్తూరు నుంచి ఒక్కో మొక్క రూ.4,500 చొప్పున కొనుగోలు చేశారు. రవాణా, కూలి ఖర్చులు కలిపి మొక్కకు రూ.5వేల వరకూ ఖర్చయింది. రెండున్నర ఎకరాల్లో 280 మొక్కలకు దాదాపు రూ.14 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు రామాంజనేయులు వివరించారు. మొక్కలు నాటిన సంవత్సరానికే కరోనా కారణంగా ఉద్యోగం వదిలి ఇంటికి వచ్చిన ఆయన పూర్తిస్థాయిలో సాగుపై దృష్టి సారించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.