ప్రతి రోజూ అదే పనిగా అప్పులు.. జగన్ సర్కారును కడిగిపారేసిన కాగ్

Share Social Media

ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు వైసీపీ సర్కార్ అప్పులు చేస్తోంది. అసలు అప్పులు లేకుండా పాలన చేయలేకపోతోంది. అప్పు తెచ్చి మరి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.
వాటికి వడ్డీ రూపంలో చెల్లింపులు, రెన్యువల్ రుణాలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రజలపై రుణభారం పడుతోంది. సంక్షేమానికి అప్పుల ప్రక్రియ అనివార్యంగా మారింది. ఆర్థిక నిర్వహణ మరింత దిగజారడంపై కాగ్ ఆక్షేపించింది. జగన్ సర్కార్ తీరును ఎండగట్టింది. ఒక్క 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 221 రోజులు చే బదులు రుణాలు తీసుకున్నట్లుగా కాగ్ గుర్తించింది. నాలుగు సంవత్సరాల్లో 341 రోజులు అప్పుల తోనే కాలం గడిపేసినట్లు స్పష్టం చేసింది.

ఏపీ అప్పులపై ఆర్థిక నిపుణులు, సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలు ఇస్తుంటే.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బిఐ ద్వారా బ్యాంకులను హెచ్చరించే దాకా పరిస్థితి వచ్చింది. ఒకానొక దశలో 1800 కోట్ల రూపాయల అప్పును ఏపీ ప్రభుత్వానికి ఇవ్వకుండా ఎస్బిఐ నిలిపివేసిందని ప్రచారం జరిగింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.బహిరంగ మార్కెట్ రుణం, కేంద్రం నుంచి వచ్చే రుణాలు, ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలు బయటకు కనిపిస్తున్నాయి కానీ.. అంతకుమించి కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారెంటీలతో తెచ్చిన రుణాలు మాత్రం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మిగుల్చుతున్నాయి.

పోనీ లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అభివృద్ధి పనుల మాటేమిటి? అని అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు. చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటి వాటికి సంబంధించి బిల్లులు చెల్లించడం లేదు. బకాయిలు పెట్టడం విస్మయం కలిగిస్తోంది. వైసిపి సర్కార్ పెండింగ్లో పెట్టిన బిల్లులు 50 వేల కోట్ల పై మాటేనని తెలుస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా బిల్లులను పెండింగ్ పెడుతూ వచ్చారు. ఇప్పుడు మరో నెల రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళనున్నారు. ఈ పెండింగ్ బిల్లుల మాటేమిటి అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. మొత్తానికైతే గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ ప్రతిరోజు చేయి చాచడమే పనిగా పెట్టుకుంది. ఈ విషయాన్ని కాగ్ కుండబద్దలు కొట్టడం విశేషం.

Related News

Related News