భారతదేశం వాతావరణ మార్పులకు ప్రతిస్పందించే విధానంలో కీలక మలుపు తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ చర్యలలో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా 2030 నాటికి దేశంలో 50 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఉందని డెలాయిట్ ఇండియా, రైన్మ్యాటర్ ఫౌండేషన్ సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది.
అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, పౌర సమాజం సమన్వయంతో పని చేయాల్సి ఉందని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.
‘ది స్టేట్ ఆఫ్ క్లైమేట్ రెస్పాన్స్ ఇన్ ఇండియా’ (The State of Climate Response in India) పేరుతో విడుదలైన ఈ నివేదిక, ఈ అద్భుతమైన ఉపాధి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి రాబోయే దశాబ్దంలో భారత దేశానికి సుమారు 1.5 ట్రిలియన్ల పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇంత భారీ పెట్టుబడి కేవలం ఉద్యోగాలను మాత్రమేకాక, వార్షిక ఆర్థిక ఉత్పత్తిలో 3.5 నుంచి $4 ట్రిలియన్లు యాడ్ చేయగలదని నివేదిక స్పష్టం చేసింది.
గ్రీన్జాబ్స్ క్రియేషన్
వాతావరణ యాక్టివిటీలో పెట్టుబడి పెట్టడం వల్ల ఉద్యోగాలు ఎక్కడ పుడతాయి? అన్న ప్రశ్నకు ఈ నివేదిక స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా, ‘ఫీడ్స్టాక్ అగ్రిగేషన్’, తయారీ రంగం, నిర్వహణ, పర్యవేక్షణ, గ్రీన్ మెటీరీయల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తేలింది.
ఈ గ్రీన్ జాబ్స్ కేవలం ఆర్థిక వృద్ధికి దోహదపడటమే కాకుండా, దేశం ఎదుర్కొంటున్న వాతావరణ సవాళ్లకు దీర్ఘకాలిక పరిష్కారాలు అందిస్తాయి. ప్రస్తుతం, వర్షపాతం సరళిలో మార్పులు, ఉష్ణోగ్రత పెరుగుదల, జీవవైవిధ్యం కోల్పోవడం వంటి అంశాలు సహజ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని, దీనివల్ల అనుసరణ ఖర్చు పెరుగుతోందని నివేదిక హెచ్చరించింది.
డెలాయిట్ ఇండియా భాగస్వామి అయిన అశ్విన్ జాకబ్ మాట్లాడుతూ, భారతదేశంలో వాతావరణ మార్పులకు కలిసికట్టుగానే పని చేయాలని అప్పుడే విజయాలు వస్తాయని ఉద్ఘాటించారు. పెట్టుబడులపై రిస్క్ను తగ్గించే విధానాలు, మెరుగైన డేటా అందుబాటు ఉంచడం, వాతావరణ పరిష్కారాలను పెద్ద ఎత్తున అమలు చేయడానికి నైపుణ్యాల్లో పెట్టుబడి చాలా అవసరం అని పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో వాతావరణ చర్యలు విచ్ఛిన్నంగా ఉన్నాయి. వ్యక్తులు, కార్పొరేట్లు కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సమన్వయం లేకపోవడం వల్ల వాటి ప్రభావం పరిమితమవుతోంది.
నివేదికలో భాగంగా నిర్వహించిన సిటిజిన్ క్లైమేట్ సర్వే 2025 భారతదేశంలోని వివిధ వాతావరణ మండలాల్లోని 1700 ఇళ్లపై చేశారు. ఈ సర్వేలో సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయి:
1. 86 శాతం మంది తమ రోజువారీ జీవితాలపై వాతావరణ మార్పు ప్రభావం చూపుతోందని చెప్పారు.
2. 33 శాతం మంది ఆరోగ్యం, జీవనోపాధి ఎఫెక్ట్ ఉందని నివేదించారు.
పౌరులు వ్యక్తిగత స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, విస్తృత భాగస్వామ్యానికి సమన్వయం కొరవడుతోంది. ఉదాహరణకు, 44 శాతం మంది వ్యర్థాల విభజన చేస్తుంటే, 40 శాతం మంది విద్యుత్తు లేదా నీటి వినియోగాన్ని తగ్గిస్తున్నారు, 30 శాతం మంది సింగిల్-యూజ్ ప్లాస్టిక్లను తగ్గించుకుంటున్నారు.
అనేక సందేహాలు, ప్రోత్సాహకాలు లేకపోవడం, తక్కువ అవగాహనతో పౌరులలో 22 శాతం మంది యాక్టివ్గా లేదు.
కార్పొరేట్ రంగంలో సన్నద్ధత
కార్పొరేట్ క్లైమేట్ రెడీనెస్ సర్వే 2025లో 50కి పైగా భారతీయ కార్పొరేట్ సంస్థలను పరిశోధించారు.
• 47 శాతం సంస్థలు పర్యావరణ మార్పుల కారణంగా తమ ఉద్యోగుల ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొంటున్నారని నివేదించాయి.
• 44 శాతం మంది మారుతున్న నిబంధనలు, వినియోగ విధానాలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
అయినప్పటికీ, కార్పొరేట్ రంగం తమను తాము సిద్ధం చేసుకోవడానికి కొన్ని చర్యలు తీసుకుంటోంది: 41 శాతం సంస్థలు వాతావరణ అనుకూల నిర్ణయాలు తీసుకుంటే, 28 శాతం ఆవిష్కరణలలో పెట్టుబడి పెడుతున్నాయి.
డెలాయిట్ ఇండియా భాగస్వామి ప్రశాంత్ మాట్లాడుతూ, గ్రీన్ జాబ్స్ సృష్టి అనేది విడివిడి ప్రయత్నాల నుంచి ముందుకు సాగి ప్రభుత్వం, వ్యాపారం, సంఘాల మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటుందని వివరించారు.
ఈ నివేదిక భవిష్యత్తు కోసం స్పష్టమైన రోడ్మ్యాప్ను అందించింది. క్లైమేట్ యాక్షన్ విజయవంతం కావాలంటే, విధానాలు, కార్పొరేట్ నిర్ణయాల్లో వాతావరణ ప్రాధాన్యతలను నిక్షిప్తం చేయాలని సూచించింది.
ముఖ్యంగా ఈ రంగాల్లో మెరుగుదల అవసరం:
1. మెరుగైన డేటా వ్యవస్థలు: నిర్ణయాలను సమర్థవంతంగా నిర్దేశించడానికి మెరుగైన, నమ్మదగిన డేటా అవసరం.
2. వాతావరణ కేంద్రీకృత ప్రతిభ అభివృద్ధి: వాతావరణ పరిష్కారాలను అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.
3. ఏకీకృత పాలన : జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో వాతావరణ పాలనను సమన్వయం చేయడం.
4. డిజిటల్ వ్యవస్థలు: ఇంధనం, వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ వంటి రంగాలను అనుసంధానించడానికి, ఆవిష్కరణలను పెద్ద ఎత్తున చేయడానికి వీలుగా పనిచేసే డిజిటల్ వ్యవస్థలు అవసరం.
రైన్మ్యాటర్ ఫౌండేషన్ CEO సమీర్ శిషోడియా అభిప్రాయం ప్రకారం, “సంక్లిష్టతను అంగీకరించడం సవాళ్లను అధిగమించడం ద్వారా, వ్యాపారాలు, ఆవిష్కరణల కోసం కొత్త అవకాశాలను అన్లాక్ చేయగలవు”.
సమర్థవంతమైన విధానాలు, భారీ పెట్టుబడులు, పౌర-కార్పొరేట్ భాగస్వామ్యం ద్వారా, భారతదేశం 2030 నాటికి కేవలం వాతావరణ మార్పులను ఎదుర్కోవడమే కాకుండా, లక్షలాది మందికి ఉపాధి కల్పించే శక్తివంతమైన గ్రీన్ ఎకానమీకి నాయకత్వం వహించగలదు.
































