భాద్యతాయుతమైన వృత్తిలో ఉండి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వారు అడ్డదార్లు తొక్కుతున్నారు. విద్యావ్యవస్థలో పనిచేస్తున్న కొందరు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. అందం, డబ్బుపై మోజుతో అక్రమ సంబంధాలకు మొగ్గు చూపుతున్నారు. వివాహేతర సంబంధాలతో కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలతో వివాహ బంధానికి తలవంపులు తెస్తున్నారు. నిండు నూరేళ్లు ఆదర్శదంపతులుగా మెలగాల్సిన వారు పరాయి వ్యక్తులపై వ్యామోహంతో విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరాయి మహిళా మోజులో పడి ఓ ఉన్నత విద్యాధికారి విద్యా వ్యవస్థకే మచ్చ తెస్తున్నాడు. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన విద్యాధికారే గాడి తప్పాడు. ఏకంగా లవర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు డీఈవో. ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా విద్యాధికారి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆయన భార్య భర్త వ్యవహారంపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే.. గురువారం (నవంబర్ 21న) రోజున వేరే మహిళతో ఉన్న సమయంలో పలువురితో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో గుట్టుగా సాగుతున్న వివాహేతర సంబంధం బట్టబయలైంది.
ఆ మహిళ ఎవరంటూ భార్య నిలదీయగా సమాధానం చెప్పకుండా నువ్వు ఇక్కడికి రావొద్దు.. బయటికి వెళ్లిపో అంటూ డీఈవో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా నెట్టింటా వైరల్ గా మారింది. అయితే తనను పెళ్లి చేసుకుని వదిలేసి 14 ఏండ్లుగా తన పలుకుబడితో కోర్టులో విడాకుల కేసు నడిపిస్తున్నాడని డీఈవో భార్య ఆరోపించింది. విడాకులు మంజూరు కాకముందే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించింది. ప్రియురాలితో ముగ్గురు పిల్లలను కూడా కన్నాడంటూ డీఈవో భార్య ఆరోపించింది. తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డీఈవో భార్య వేడుకుంది.
ఈ క్రమంలో నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఈవో భార్య ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. వివాహేతర సంబంధం బయటపడడంతో డీఈవో చేసిన దారుణాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గతంలో మహిళా టీచర్లపై కూడా డీఈవో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఈవోపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.