పగబట్టిన ప్రకృతి.. వానలు, వరదలతో విధ్వంసం..! ఇంకా ఉందంటూ ఐఎండీ హెచ్చరిక.

www.mannamweb.com


కేరళ కొండల్లో బురద, బండరాళ్లు సృష్టించిన విలయ గీతం ఇంకా మరువకముందే.. ఉత్తరాదిపై వరుణుడు తన ప్రకోపం చూపిస్తున్నాడు. ఉత్తరాఖండ్‌ మొదలు రాజస్థాన్‌ వరకూ ఉత్తరభారత రాష్ట్రాల్లో ఎడతెగని వానలు పడుతున్నాయి.

భారీవర్షాలు, వరదల విలయంతో ఏడు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముంచెత్తుతున్న వానలు, వరదలతో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, తెహ్రీ, డెహ్రడూన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. కుంభవృష్టితో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప ఇళ్లను నేలమట్టంచేశాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, ఛమోలీ జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. హరిద్వార్‌లోని రోషనాబాద్‌లో 210 మిల్లీమీటర్లు, డెహ్రాడూన్‌లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అటు హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెరుపు వరదలు పోటెత్తి అనేక ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం మయ్యాయి. వంతెనలు, రహదారులు, జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. వేర్వేరు ఘటనల్లో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది గల్లంతయ్యారు. బియాస్‌ నది ఉప్పొంగి అనేక చోట్ల చండీగఢ్‌-మనాలి జాతీయ రహదారి దెబ్బతింది. కొండచరియలు పడటంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. గల్లంతైన వారి జాడ కోసం ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీని కూడా వానలు వణికిస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 14 ఏళ్లలో ఒక్కరోజులో ఇంతటి వర్షం పడటం ఇదే తొలిసారి. ముఖ్యంగా మయూర్‌విహార్‌ వద్ద 147 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది.

ఇప్పటికే వానలతో వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాల్లో.. రానున్న నాలుగైదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, గోవాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు జులైలో భారత్ సగటు కంటే 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయిందని చెబుతోంది..ఐఎండీ.

దేశంలో కొంతకాలంగా వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. వేసవిలో తీవ్రమైన ఎండలు దడ పుట్టిస్తుంటే..వర్షాకాలంలో కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అత్యాశతో మనిషి చేస్తున్న చర్యలే ఈ ప్రకృతి విపత్తులకు కారణమని చెబుతున్నారు పర్యావరణ వేత్తలు. గతంలో కేదారనాథ్‌ వరద విలయం నుంచి..ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ను కుదిపేస్తున్న వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఉత్పాతాలన్నీ పర్యావరణ విధ్వంసం కారణంగా జరుగుతున్నాయంటున్నారు.

హిమాలయాల్లో విచ్చల విడిగా చెట్లను కొట్టేయడం, కొండలను తొలిచేయడం వంటి ఘటనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అలాగే పర్యావరణ పరంగా సున్నితమైనప్రాంతాల్లో ఆనకట్టలు, పవర్‌ ప్రాజెక్టుల నిర్మించడం వంటి చర్యలు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న సూత్రం..పర్యావరణానికి కూడా వర్తిస్తుందంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ వరదలకు వాతావరణ మార్పులతో పాటు అటవీ నిర్మూలన, పట్టణీకరణ, మైనింగ్‌ వంటి మానవ చర్యలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. చివరకు అవి అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి జాతీయ స్థాయిలో అడుగులు పడాలని కోరుతున్నారు.. మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే. ఇందుకోసం ప్రధాని సారథ్యంలో అన్ని పార్టీల ప్రతినిధులతో జాతీయ మండలిని ఏర్పాటు చేసి..అందులో అన్ని రాష్ట్రాల సీఎంలు, సంబంధిత విభాగాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. వాతావరణ మార్పుల కట్టడికి రాష్ట్రాల, రంగాల వారీగా చేపట్టాల్సిన చర్యలతో ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని సూచించారు..ఆదిత్య ఠాక్రే. మరి ఈ ప్రకృతి విపత్తలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.