ఉపాధ్యాయుల పనితీరుకు సూచికలు తయారుచేయండి – పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
గరిష్ఠంగా 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ


ఈనాడు, అమరావతి: విద్యార్థుల్లో అభ్యసన ప్రమాణాలు పెంపొందించేందుకు విద్యాహక్కు చట్టంలోని నిబంధనల మేరకు ఉపాధ్యాయుల జవాబుదారీతనం, పనితీరు మదింపునకు సూచికలు రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. విద్యాహక్కు చట్ట నిబంధన 25(2)(డి) ప్రకారం జవాబుదారీతనం, పనితీరు సూచికలు తయారు చేయాలని, 25(2)(ఈ) మేరకు ఉపాధ్యాయులు, అధికారులు, వ్యవస్థల పనితీరును నిర్దిష్టకాలంలో మదింపు చేయాలని పేర్కొంది. ఎన్‌సీఈఆర్‌టీని సంప్రదించి సూచికల తయారీని సాధ్యమైనంత త్వరగా, గరిష్ఠంగా ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. పనితీరు సూచికల మార్గదర్శకాలు రూపొందించి, వాటిని సక్రమంగా అమలు చేయడం వల్ల విద్యావ్యవస్థలో మరింత జవాబుదారీతనం వచ్చి, అభ్యసన ఫలితాలు మెరుగుపడతాయని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

గుంటుపల్లి శ్రీనివాస్‌ పిల్‌..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అధ్యయన, అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు విద్యాహక్కు చట్టం, ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్, ట్రైనింగ్‌) నిబంధనల మేరకు నిర్వహించిన బేస్‌లైన్, టీఏఆర్‌ఎల్‌ (టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవల్‌) టెస్టుల ఫలితాలను గత ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ 2023లో హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. ‘విద్యార్థుల పఠన సామర్థ్యం తగ్గిపోతోంది. రెండో తరగతి పాఠ్యాంశాన్ని ఐదో తరగతి, ఐదో తరగతి పాఠాన్ని పదో తరగతి పిల్లల్లో ఎక్కువ మంది చదవలేక పోతున్నారు. వార్షిక స్థాయి విద్యా నివేదిక (ఏఎస్‌ఈఆర్‌)-2022 ఇదే విషయాన్ని చెబుతోంది. బేస్‌లైన్, టీఏఆర్‌ఎల్‌ టెస్టు ఫలితాలను ప్రభుత్వం తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేసింది. ఉపాధ్యాయుల పనితీరు మదింపునకు సూచికలు రూపొందించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.