DHL QR code scam : క్యూఆర్ కోడ్ తో నకిలీ డెలివరీ స్కామ్స్ ఎన్నో! ఎలా మాయచేస్తారంటే!

www.mannamweb.com


DHL QR code scam :భారత్ లో పెరుగుతున్న ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు అనూహ్య రీతిలో సైబర్ నేరాల పెరుగుదలకు సైతం దారితీశాయి. ఇక ఈ ఆన్లైన్ వేదికలను ఆసరాగా చేసుకొని ఎన్నో స్కామ్స్ జరుగుతుండగా..

తాజాగా అందర్నీ భయపెడుతున్న మరో స్కామ్.. DHL QR కోడ్ స్కామ్. ఈ స్కామ్ DHL డెలివరీ నోటీసును పంపించిందంటూ బాధితులను చేరుతుంది. ఆపై స్కామ్ మెుదలవుతుంది. అయితే అసలు DHL QR కోడ్ స్కామ్ అంటే ఏమిటి? ఇందులో స్కామర్స్ బాధితులను ఎలా చేరుతారు? ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైతే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి.. ఇలాంటి విషయాలు ఓసారి చూద్దాం.

ఈ రోజుల్లో QR కోడ్ స్కామ్ పేరుతో జరుగుతున్న మోసాలే ఎక్కువ. ఈ స్కామ్ లో మోసపోయిన చాలా మంది వారి ఇంటి వద్ద అనుమానాస్పద డెలివరీ నోటీసులను అందుకున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ప్యాకేజీ డెలివరీ కోసం QR కోడ్‌ను స్కాన్ చేయమని కోరినట్లు తెలిపారు. ఇక కొన్ని నోటీసులు చట్టబద్ధమైనవే అయినప్పటికీ, DHL డెలివరీలకు సంబంధించిన నకిలీ సందేశాలు చాలా సాధారణం అవుతున్నాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

DHL QR కోడ్ స్కామ్ అంటే ఏమిటి? –

DHL నుండి వచ్చినట్లు చెబుతూ నకిలీ డెలివరీ నోటీసును బాధితులు అందుకున్నప్పుడు ఈ స్కామ్ మెుదలవుతుంది. నోటీసులో QR కోడ్ తో పాటు డెలివరీ అందుకున్న వ్యక్తి 3 సాధారణ పద్ధతుల్లో డెలివరీని తిరిగి పంపవచ్చని చెబుతారు. ఇదే విషయం ఆ పార్సిల్ పైన సైతం ఉంటుంది. ఇక QR కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు, అది బాధితుడిని మోసపూరిత వెబ్‌సైట్‌కి తీసుకుపోతుంది. అక్కడ డెలివరీ టైప్ ను నిర్ధారించడానికి వేబిల్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయమని అడుగుతుంది. ఇక వెబ్‌సైట్ నమ్మదగినదిగా అనిపించటంతో అదే విధంగా బాధితులు ఆ నెంబర్ ను ఎంటర్ చేయగానే.. ఫోన్ లో ఉండే ముఖ్యమైన సమాచారం హ్యాక్ అయిపోతుంది.

ఈ పేపర్ నోటీసులతో పాటు, స్కామర్లు SMS సందేశాలను కూడా పంపుతారు. “మీ ప్యాకేజీ ప్రస్తుతం మా దగ్గర ప్రాసెస్ చేయబడుతోంది. దిగుమతి ఛార్జీలపై మరిన్ని అప్డేట్స్ కోసం https://dhlhub.comను క్లిక్ చేయండి.” అంటూ చెప్తుంది. అయితే లింక్ అధికారిక DHL వెబ్‌సైట్ మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ, ఇది మాల్‌వేర్ ఇన్‌స్టాలేషన్‌కు లేదా వ్యక్తిగత డేటా దొంగతనానికి దారితీసే విధంగా వినియోగదారులను మోసగించడానికి ఉద్దేశించిన నకిలీ URL. ఈ విషయాన్ని అంత తేలికగా గుర్తించలేరు కూడా.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి –

మోసగించడానికి స్కామర్‌లు ఉపయోగిస్తున్న తాజా విధానం QR కోడ్‌లు అని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ మోసాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని విషయాలు తెలుసుకోవల్సిందే. ఎప్పుడూ URLలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. అధికారిక డొమైన్ “dhl.com” ను సర్చ్ చేయాలి. అనుమానాస్పద లింక్స్ పై క్లిక్ చేయకూడదు. తెలియని లేదా నమ్మకంగా లేని QR కోడ్‌లను స్కాన్ చేయవద్దు. సందేహాస్పద డెలివరీ నోటీసు లేదా సందేశం వస్తే నేరుగా DHL అధికారిక కస్టమర్ సర్వీస్ కు రిపోర్ట్ చేయాలి.