ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. శరవేగంగా విస్తరిస్తోందీ వ్యాధి. మరీ ముఖ్యంగా భారత్‌లో ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు ఒక కారణమైతే.. జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా డయాబెటిస్‌కు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇక వంశపారపర్యంగా కూడా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే అంత సులభంగా పూర్తిగా బయటపడడం కష్టమని తెలిసిందే. అందుకే జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ముందు నుంచే వాకింగ్‌ను లైఫ్ స్టైల్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. ఇక తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతుంటారు. వీటితో పాటు ఆహారం తీసుకుంటున్న విధానంలో కూడా పలు మార్పులు చేసుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలని చెబుతుంటారు.
అయితే వీటన్నింటీతో పాటు ఆహారాన్ని నమిలే విధానం కూడా డయాబెటిస్‌కు కారణమవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గబిజిబీ జీవితంలో చాలా మంది తినడానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి ఉంది. దీంతో ఆదరబాదరగా తినే రోజులు వచ్చేశాయ్. ఇలా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని తెలిసిందే.
సరిగ్గా నమలకుండా మింగేయడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అన్నల్స్ ఆఫ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ అండ్ మెటాబొలిజం జర్నల్‌లో ఈ విషయాలను ప్రచురించారు. ఆహారాన్ని వేగంగా తినేవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు.
శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు సరైన రీతిలో ప్రతిస్పందించనపుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరుగుతుతాయి. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలడం ద్వారా మనం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను క్రమబద్ధీకరించుకోవచ్చు, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచుకోవచ్చు. దీంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.