డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి

www.mannamweb.com


విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా విలయ తాండవం చేస్తుంది. వాంతులు, విరోచనాలతో నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు మృతి చెందారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు.

వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయేరియాను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.

డయేరియా మృతిచెందిన మృతులు తొండ్రంకి రామాయమ్మ, సారికి పెంటయ్య, పైడమ్మ, కలిశెట్టి సీతమ్మలుగా గుర్తించారు. కలుషిత నీరు తాగడం వలనే డయేరియా ప్రబలినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య పై కూడా దృష్టి సారించి చర్యలు చేపట్టారు. మరోవైపు వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయేరియాను అదుపు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇరవై రెండు మంది రోగులు జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్ కు తరిలించారు. రోగులు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యాధికారులు. అయితే డయేరియా తో ఐదుగురు చనిపోవడం పై వైసిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. డయేరియాతో ఐదుగురు చనిపోవడం బాధాకరమని జిల్లా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా వైద్యం పడకేసిందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు.

డయేరియా మరణాలన్ని ప్రభుత్వ మరణాలని, తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభలిన డయోరియా ఘటన పై ముఖ్యమంత్రి కార్యలయం కూడా వెంటనే స్పందించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ కూడా వెంటనే రంగంలోకి దిగి చర్యలకు చేపట్టారు. గుర్ల గ్రామాన్ని సందర్శించడంతో పాటు డయేరియా బాధితులను కూడా కలిసి పరిస్థితి పై ఆరా తీశారు. డయేరియా అదుపు చేసేందుకు అదనపు వైద్య సిబ్బందిని నియమించి గ్రామంలో క్లోరినేషన్ జరిపించారు. గ్రామంలో డయేరియా అదుపులోకి వచ్చే వరకు వైద్య ఉన్నతాధికారులు గ్రామంలో ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు.. ప్రభుత్వ చర్యలతో కొంత మేర భాదితులు కోలుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలియజేశారు.