పొరపాటున వేరే UPI ఐడీకి మనీ సెండ్ చేశారా? ఇలా చేస్తే క్షణాల్లో డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయ్

2025, జులై 15 నుంచి నిజమైన UPI పేమెంట్ సమస్యలకు బ్యాంకులే నేరుగా రీఫండ్స్‌ ఇచ్చేయొచ్చు. ఇందుకు NPCI పర్మిషన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.

ఆన్‌లైన్ పేమెంట్స్‌లో జరిగే పొరపాట్లకు చెక్ పెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త రూల్స్ ప్రకటించింది. ఇప్పుడు పొరపాటున వేరే వ్యక్తికి మనీ సెండ్ చేసినా, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొత్త రూల్‌తో మన డబ్బులు మనకు మరింత స్పీడ్‌గా వెనక్కి వచ్చేస్తాయి. 2025, జులై 15 నుంచి నిజమైన UPI పేమెంట్ సమస్యలకు బ్యాంకులే నేరుగా రీఫండ్స్‌ ఇచ్చేయొచ్చు. ఇందుకు NPCI పర్మిషన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.


ఇంతకు ముందు, ఒక కస్టమర్ నుంచి పదే పదే రీఫండ్ రిక్వెస్ట్‌లు వస్తే.. అంటే, అకౌంట్‌కు సంబంధించిన సమస్యలపై నెలకు 10 సార్ల కన్నా ఎక్కువ లేదా ఒకే UPI ID పెయిర్ (UPI ID pair)కు 6 సార్ల కన్నా ఎక్కువసార్లు రిక్వెస్ట్ పెడితే.. సిస్టమ్ ఆటోమేటిక్‌గా CD1 లేదా CD2 అనే రీజన్ కోడ్స్‌తో ఆ క్లెయిమ్స్‌ను అడ్డుకునేది. సమస్య నిజమైనదైనా సరే, NPCI వారు మ్యాన్యువల్‌గా ఆ కంప్లైంట్‌ను “వైట్‌లిస్ట్” చేసేదాకా బ్యాంకులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ఈ తతంగం వల్ల వారాలు, కొన్నిసార్లు నెలల తరబడి డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది.

NPCI ఇప్పుడు RGNB (Remitting Bank Raising Good Faith Negative Chargeback) అనే ఒక కొత్త ఆప్షన్‌ను లాంచ్ చేసింది. ఒకవేళ రీఫండ్ రిక్వెస్ట్ నిజమైనదని బ్యాంకులకు అనిపిస్తే, ఆటోమేటిక్ బ్లాక్‌ను ఈజీగా దాటవేసి మనకు సాయం చేయొచ్చు. అంటే, తప్పుడు UPI IDకి డబ్బులు వెళ్లినా, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, లేదా ఎవరైనా మనల్ని మోసం చేసినా, బ్యాంకులు స్వయంగా రంగంలోకి దిగి, NPCI క్లియరెన్స్ కోసం వెయిట్ చేయకుండానే మన డబ్బును మనకు తిరిగి ఇచ్చేస్తాయి

ఈ RGNB పాలసీతో రీఫండ్స్‌ అత్యంత వేగంగా అందుతాయి, NPCI రివ్యూ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన ఆందోళన తొలగిపోతుంది. తప్పుడు ట్రాన్స్‌ఫర్లు, మోసాలు, ఫెయిల్ అయిన పేమెంట్లు, లేదా ఆన్‌లైన్‌లో కొన్న వస్తువులు డెలివరీ కాకపోవడం వంటి అనేక సాధారణ సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. అయితే, బ్యాంకులు కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ RGNB ఆప్షన్‌ను దుర్వినియోగం చేస్తే భారీ జరిమానాలు విధిస్తారు, తద్వారా నిజమైన ఫిర్యాదులకే ప్రాధాన్యత లభిస్తుందని NPCI స్పష్టం చేస్తోంది.

అయితే, బ్యాంకులు ఈ RGNB ఆప్షన్‌ను అన్నిసార్లూ వాడలేవు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వాడాలి. అవేంటంటే ముందుగా, పాత ఛార్జ్‌బ్యాక్ రిక్వెస్ట్ CD1 లేదా CD2 కారణాలతో తిరస్కరణకు గురై ఉండాలి. ఆ తర్వాత, బ్యాంక్ సొంతంగా ఎంక్వైరీ చేసి, కంప్లైంట్ నిజమైనదేనని కన్ఫర్మ్ చేసుకోవాలి. చివరగా, ఈ రిక్వెస్ట్‌ను URCS (Unified Real-time Clearing & Settlement) ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలి, వేరే ఏ అడ్డదారుల్లోనూ కాదు.

సమస్య నిజమైనదే అయినా, బ్యాంక్ RGNB రిక్వెస్ట్ చేయడానికి ఒప్పుకోకపోతే.. అప్పుడు సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ముందుగా, బ్యాంక్‌లో ఉండే సాధారణ కంప్లైంట్ మార్గాలన్నీ ప్రయత్నించాలి. అక్కడ పని జరగకపోతే, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. లేదా, యూపీఐకి సంబంధించిన ఫిర్యాదుల కోసమే NPCI వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన UDIR (Unified Dispute And Issue Resolution) అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఫిర్యాదును ఫైల్ చేయవచ్చు.

మన దేశంలో ప్రతినెలా 1,140 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు (2025, మే నాటి లెక్క) జరుగుతున్నాయి. ఇందులో చిన్న పొరపాటు జరిగినా లక్షలాది మంది ఇబ్బంది పడతారు. ఇప్పటిదాకా, చాలామంది నిజమైన బాధితులు కూడా సిస్టమ్ రూల్స్ వల్ల డబ్బులు తిరిగి రాక నానా తిప్పలు పడ్డారు. కానీ, ఈ NPCI కొత్త రూల్ పుణ్యమా అని, బ్యాంకులు వేగంగా స్పందించి, ప్రజలు తమ డబ్బును ఎలాంటి సుదీర్ఘమైన ప్రాసెస్‌లు లేకుండానే త్వరగా తిరిగి పొందేలా చేస్తుంది. తప్పుడు UPI ట్రాన్స్‌ఫర్ చేసి టెన్షన్ పడిన ప్రతీ ఒక్కరికీ ఇది నిజంగా ఒక పెద్ద రిలీఫ్.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.