భోజనం తర్వాత వీటిని తింటే జీర్ణ సమస్యలకు వెల్‌కం చెప్పినట్లే.. లైట్ తీసుకున్నారో బండి షెడ్డుకే

www.mannamweb.com


ఆరోగ్యంగా ఉండడం కోసం పోషకాహారం తినడం తప్పనిసరి. సంపూర్ణ పోషకాహారం తినడం వలన మాత్రమే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి కార్యకలాపాలను అయినా సజావుగా చేయగలుగుతారు. అందుకే తప్పని సరిగా సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. దీనితో పాటు బ్రేక్ ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా సరైన సమయంలో తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. అయితే ఆహారం తిన్న తర్వాత కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకుంటే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మొదలవుతాయి.

ఆహారం తిన్న తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నడవడం మంచిది. తద్వారా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఆహారం తిన్న తర్వాత కొందరికి తరచుగా అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దీని వెనుక ప్రధాన కారణం.. భోజనం తర్వాత చేసే కొన్ని తప్పులు. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
భోజనం తర్వాత చల్లని నీరు తాగకూడదు

నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.. అయితే ఆహారం తిన్న వెంటనే నీరు.. ముఖ్యంగా చల్లటి నీరు తాగకూడదు. ఎందుకంటే తిన్న వెంటనే నీరు తాగడం వలన జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని కారణంగా ఆహారం జీర్ణం కావడంలో అవరోధం ఏర్పడి కడుపు నొప్పి, బరువు పెరగడం, అసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి.

స్నానం చేయవద్దు

ఆహారం తిన్న తర్వాత నీరు త్రాగడం ఎలా నిషేధించారో.. అదే విధంగా తిన్న వెంటనే స్నానం చేయడం కూడా సరైనది కాదు. ఎందుకంటే ఇలా స్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీని కారణంగా జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఫలితంగా వికారం, వాంతులు మొదలవుతాయి. అందుకే భోజనానికి ముందే స్నానం చేయడం, కాళ్లు కడుక్కోవడం మంచిది.
తిన్న తర్వాత నిద్రపోవడం మానేయాలి

చాలా మందికి ఆహారం తిన్న వెంటనే నిద్ర పోవడం, కూర్చోవడం అలవాటు. ఈ అలవాటు మీకూ ఉంటే.. వెంటనే వదిలేయండి. ఈ అలవాట్లు జీర్ణక్రియను పాడుచేయడమే కాకుండా ఊబకాయం పెరిగే అవకాశాలను పెంచుతుంది. కనుక తిన్న తర్వాత కొంత సేపు వజ్రాసనం వేయడం లేదంటే నడవడం మంచిది.
భోజనం తర్వాత టీ, కాఫీలు వద్దు

ఆహారం తిన్న తర్వాత టీ లేదా కాఫీ తీసుకుంటే ఎసిడిటీ వస్తుంది. ఇది గుండెల్లో మంట, పుల్లని త్రేనుపు వంటి సమస్యల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది.
స్వీట్లు తినే అలవాటు మానుకోవాలి

నేటికీ భారతీయులు భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ అలవాటు కూడా ఆరోగ్యానికి చాలా హానికరం.