చంద్రబాబు ప్రభుత్వమొస్తే స్పీకర్ ఆయనేనట ! రఘురామ ఫ్యాన్స్ కు నిరాశే..!

ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై టీడీపీ ధీమాగా కనిపిస్తోంది. ఆ పార్టీకి కచ్చితంగా 125 సీట్లకు పైగా వస్తాయని రఘురామకృష్ణంరాజు, 130 సీట్లు వస్తాయని బుద్ధా వెంకన్న వంటి వారు జోస్యాలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ జూన్ 4న ఫలితాల్లో ఎన్డీయే కూటమి గెలిస్తే ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో ఏ పదవుల్లో ఎవరు ఉండాలనే దానిపై మూడు పార్టీల్లోనూ అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


ఇదే క్రమంలో అసెంబ్లీ స్పీకర్ పదవికి పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణంరాజు పేరు నిన్న మొన్నటివరకూ వినిపించింది. ఆయనే పలుమార్లు తాను స్పీకర్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నట్లు చెప్పుకున్నారు. అయితే చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని కూడా చెప్పేశారు. మరోవైపు తాజాగా స్పీకర్ పదవికి మరో పేరు పరిశీలనకు వస్తున్నట్లు తెలుస్తోంది.
రాయలసీమలోని ఉరవకొండ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిచిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పేరు తాజాగా స్పీకర్ రేసులోకి వచ్చింది. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి లభించని పయ్యావులకు విపక్షంలో ఉన్న సమయంలో పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చి చంద్రబాబు గౌరవించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలవని పయ్యావుల కేశవ్..ఆ పార్టీ ఓడి విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఆ సంప్రదాయం మారి మరోసారి పయ్యావుల గెలిచి, కూటమి కూడా గెలిస్తే అప్పుడు స్పీకర్ పదవి ఆయనకు ఖాయమంటున్నారు.