కరోనా వైరస్ తర్వాత మరోసారి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో, వైద్యుల్లో ఆందోళన పెరిగింది. ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న అంతుచిక్కని వ్యాధి కారణంగా 140 మంది రోగులు మరణించారు.
డబ్ల్యూహెచ్ఓ ఈ వ్యాధికి ‘డిసీజ్ ఎక్స్’ అని పేరు పెట్టింది, ఎందుకంటే దీని గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.చికిత్స అందక చాలా మంది రోగులు ఇళ్లలోనే మరణిస్తున్నారు. ఈ వ్యాధి ప్రభావం మహిళలు, పిల్లలపై ఎక్కువగా కనిపిస్తోంది. ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని వన్యప్రాణులతో సహా జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాప్తి కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి ఖండాంతరాలు దాటి వేగంగా వ్యాప్తి చెందితే యావత్ ప్రపంచాన్నికలవరపెడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ఇంకా భారత్ కు చేరనప్పటికీ, పెరుగుతున్న కేసుల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ‘డిసీజ్ ఎక్స్’ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరిస్తోంది.
డిసీజ్ ఎక్స్ అంటే ఏమిటి?
డిసీజ్ ఎక్స్ అనేది డబ్ల్యూహెచ్ఓ ఉపయోగించే ప్లేస్ హోల్డర్ పదం. ఇది ఇంకా గుర్తించని అంటువ్యాధులను సూచిస్తుంది. ప్రస్తుతం వైద్య శాస్త్రానికి తెలియని వ్యాధులు ఇవి. గ్లోబల్ హెల్త్ ప్లానింగ్ కింద 2018లో డబ్ల్యూహెచ్ఓ తొలిసారిగా ఇలాంటి పదాన్ని ప్రస్తావించింది. ఆ మరుసటి ఏడాది అంటే 2019లో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించింది. ‘డిసీజ్ ఎక్స్’ అంటే సైన్స్ అండ్ హెల్త్ సెక్యూరిటీలో అప్రమత్తత అనే అర్థం వస్తుంది. కాంగోలో నమోదైన 376 కేసుల్లో 200 మంది 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలేనని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ జీన్ కాసియా తెలిపారు. క్వాంగో ప్రావిన్స్‌లోని పంజీ హెల్త్ జోన్లో అక్టోబర్ 24న ఈ వ్యాధి తొలిసారిగా నమోదైంది.
డిసీజ్ ఎక్స్ లక్షణాలు
ఇది అంతుపట్టని వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించి ఖచ్చితమైన లక్షణాల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే, ఇది సార్స్, కోవిడ్-19 లేదా ఎబోలా వంటి మునుపటి ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్ వ్యాధి సోకిన రోగుల్లో జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీనత, తీవ్రమైన ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినది కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఫ్లూ కేసులు పెరుగుతున్న సమయంలో ఈ వ్యాధి బయటపడింది. గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, కొత్త వ్యాధికారక క్రిములు వ్యాప్తి చెందుతాయని నిపుణులు అనుమానిస్తున్నారు. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి డబ్ల్యూహెచ్ఓ మందులు, డయాగ్నస్టిక్ కిట్లు, నిపుణులను కాంగోకు పంపింది.
వ్యాధిని ఎలా నివారించాలి ?
– సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి.
– మీ ముఖాన్ని, కళ్ళు, ముక్కు, నోటిని పదేపదే తాకడం మానుకోండి. చేతులు పరిశుభ్రంగా చేసుకున్నాకే తాకాలి.
– రద్దీ ప్రదేశాల్లో మాస్కులు వాడాలి.
– శారీరకంగా చురుకుగా ఉండండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. తగినంత నిద్రను పొందండి. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
– అంటువ్యాధులను నివారించడానికి విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించండి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)