Disha Special Story: సునీతా విలియమ్స్ కు స్వాగతం.. ఆమె భూమికి తిరిగి రావడానికి తేదీ ఫిక్స్ అయింది.

ఎనిమిది నెలలు.


భూమిపై కాలుమోపాలనే తాపత్రయం ఆమెది

ఇంకెప్పుడొస్తుందా అనే నిరీక్షణ ప్రజలది

కానీ..

పరిస్థితులు అనుకూలించలేదు

సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే చిక్కుకుంది

ఆమెకు ఏమైందని అందరిలో ఆందోళన

భూమ్మీదికి సాఫీగా వస్తారా అనే డౌట్లు

అన్నింటికీ చెక్ పెడుతూ..

స్పేస్ నుంచి సేఫ్‌గా రానున్నారనే వార్త

వారం రోజుల యాత్ర అని బయల్దేరి అక్కడే చిక్కుకుపోయారు సునీతా విలియమ్స్‌(Sunita Williams). ఫొటో ఒకటి స్పేస్ (Space)నుంచి రిలీజైంది. లక్ష డౌట్లు జనాలకు. బక్కచిక్కి.. నీరసంగా కనిపిస్తున్న సునీతకు ఏమైందనే ఆందోళన. భూమ్మీద కాలుమోపిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుంది. వాతావరణం సహకరిస్తుందా.? ఇన్నాళ్లూ గాల్లో తేలియాడిన వారు ఇప్పుడు భూమిపై తేలికగా నిలబడగలరా? అనే డౌట్లు చాలానే ఉన్నాయి. అయితే నాసా(NASA) మాత్రం చిక్కుకుపోయారనే వాదనను కొట్టిపారేస్తోంది. మరోవైపు ఇక్కడ చిక్కుకుపోయినట్లు తాము కూడా భావించడం లేదని సునీత విలియమ్స్​కూడా వెల్లడించారు. అనుకోకుండా దొరికిన సమయాన్ని పరిశోధనల కోసం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎనిమిది రోజులు అనుకున్న టూర్​ఎనిమిది నెలలపాటు సాగడమే ఇక్కడ అందిరిలోనూ ఉత్కంఠను రేకెత్తించింది. దీంతో వారిద్దరూ క్షేమంగా ఇంటికి రావాలని.. అంతా కోరుకుంటున్నారు

2024 జూన్ 6వ తేదీ. సునీతా విలియమ్స్.. బుచ్ విల్‌మోరె రోదసీ(Butch Wilmore Rhodesy)లోకి వెళ్లారు. అది జస్ట్ 8 రోజుల మిషన్ మాత్రమే. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్‌(Boeing Star liner capsule)లో రు ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. జూన్ 14వ తేదీన తిరుగు ప్రయాణం అని ముందే ప్లాన్ వేసుకున్నారు. దాని ప్రకారమే తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ.. వ్యోమనౌక(spaceship)లో ఏవో సాంకేతిక సమస్యలు. ఓర్నీ.. ఎరక్కపోయి ఇరుక్కున్నామని టెన్షన్ పడ్డారు. రేపు మాపు అని షెడ్యూల్ మారుతూ వస్తోంది కానీ వీళ్లకు భూమిపైకి వెళ్లే మోక్షం లభించలేదు. హీలియం లీకేజీని గుర్తించి అందులో రావడం సురక్షితం కాదని వ్యోమగాముల(Astronauts)ను అక్కడే వదిలేసి క్యాప్సుల్ తిరుగుపయణం అయింది. పాపం.. వాళ్లు మాత్రం అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు.

మార్చి 19కి ముహూర్తం

ఇంటర్నేషనల్ స్పేస్ సిటీ(International Space City)లో చిక్కుకుపోయిన వ్యోమగాములను ఎలాగైనా భూమిపైకి తీసుకురావాలని నాసా విశ్వ ప్రయత్నాలు చేసింది. ప్రతీసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడి ఒక టెన్షన్ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Donald Trump) ఈ బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌(Elon Musk)కు అప్పగించాడు. వ్యోమగాముల రాకలో ఒక క్లారిటీ వచ్చింది. ది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మార్చి 12వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్తుంది. మార్చి 19వ తేదీన వ్యోమగాములతో తిరిగి భూమిని చేరుతుంది. 8 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ మార్చి 19న సునీతా విలియమ్స్.. బుచ్ విల్‌మోరె భూమ్మీద కాలుమోపనున్నారు. అంతరిక్షంలోకి కాలుమోపడం ఎంత కష్టమో.. అక్కడినుంచి భూమ్మీదికి రావడం కూడా అంతే కష్టం ఉన్నట్లుంది కదా.

చిక్కిపోయిన సునీత

గత నవంబరులో నాసా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. అందులో సునీత విలియమ్స్​చిక్కిపోయి కనిపించారు. దీంతో ఆమె ఆరోగ్యంతో అనేక వదంతులు వచ్చాయి. స్పేస్​అనీమియా(Space anemia) ముప్పు ఉందని సోషల్​ మీడియాలో చర్చలు నడిచాయి. ఈ వార్తలపై నాసా స్పందించింది. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు అంతా క్షేమంగా ఉన్నట్లు వెల్లడించింది. ఆరు నెలల కంటే వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువకాలం ఉంటే వారి ఎముకల సాంద్రత తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

గ్రావిటీ సమస్య..

భూమ్మీదికొస్తున్నాం అనే సంతోషం ఉన్నా.. వచ్చాక తలెత్తే సమస్యలను ఊహించుకుంటే భయమేస్తోంది అంటున్నారు వ్యోమగాములు. గ్రావిటీలో చాలా ఇబ్బంది అవుతుందట. మామూలుగా మనం వాహనంలో 100 కిలోమీటర్ల జర్నీ చేస్తేనే కాళ్లు పట్టేస్తుంటాయి. అలాంటిది వీళ్లు 8 నెలలుగా కూర్చోలేదు.. పడుకోలేదు.. నిలబడలేదు. తేలియాడుతూనే గడిపారు కాబట్టీ గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వస్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా శరీరమంతా ఏదో భారంగా అనిపిస్తుందట. కొత్తగా నడకను నేర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న పెన్సిల్ ముక్కను ఎత్తినా భారీ వ్యాయామ కసరత్తు చేసిన ఫీలింగ్ కలుగుతుందట.

స్పేస్ ఎనీమియా

సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లింది అనగానే గ్రేట్‌గా ఫీలవుతాం కదా.? కానీ వాళ్ల కష్టాలు తెలిస్తే అయ్యో అనే పరిస్థితి. స్పేస్ నుంచి భూమ్మీదికి వస్తేనేమో గ్రావిటీ సమస్యతో నడవడానికి.. కూర్చోవడానికి కొంతకాలం ఇబ్బంది పడతారు. అంతరిక్షం చేరుకున్నాక కూడా చాలా సమస్యలుంటాయట. ముఖ్యంగా వారి శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుందని నాసా నివేదిక చెప్తున్నది. మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో ఎర్ర రక్తకణాలు పాడవుతాయి. దీంతో శరీరం ఆక్సీజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. నిస్సత్తువ.. అలసట ఏర్పడి శారీరక.. మానసిక పనితీరు మారుతుంది. ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. గుండె పనితీరులోనూ ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.

62 గంటల 6 నిమిషాలు

ఐఎస్ఎస్‌లో ఉన్న సునీతా విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పింది. ఆమె 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచింది. వ్యోమనౌకలో సాంకేతిక సమస్య వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటకొచ్చి కొన్ని రిపేర్లు చేశారు. 6.5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ఇది సునీత తొమ్మిదో స్పేస్ వాక్ కాగా.. విల్‌మోర్‌కు ఐదోది. మొత్తం 62. 6 గంటల పాటు ఈ విన్యాసంలో సునీత పాల్గొన్నది. దీంతో గతంలో నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ పేరిట 60.21 గంటల పాటున్న స్పేస్‌వాక్‌ను సునీత అధిగమించారు. రిపేరింగ్ టైమ్‌లో ఐఎస్ఎస్ నుంచి బయకొచ్చి రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ యాంటినా వ్యవస్థ సహా ప్రైమరీ ఆబ్జెక్టివ్‌లను పూర్తిచేశారు. అక్కడి ఉపరితలంపై నమూనాలను ల్యాబ్ విశ్లేషణ కోసం సేకరించారు.

స్పేస్‌ వాక్ అంటే.?

వ్యోమగాములు అంతరిక్షంలోని వాహనం నుంచి కిందికి దిగితే దాన్ని స్పేస్ వాక్ అంటారు. సునీతా విలియమ్స్ 2025 జనవరి 30న పసిఫిక్ మహాసముద్రం నుంచి 423 కిలోమీటర్ల ఎత్తులో ఆమె స్పేస్ వాక్ చేశారు. వ్యోమగాములు అంతరిక్షంలో సేఫ్టీకోసం స్పేస్ సూట్లు ధరిస్తారు. దీనిలోపల ఆక్సిజన్ ఉంటుంది. తాగడానికి అవసరమైన నీరు కూడా ఉంటుంది. ఆక్సిజన్‌ను మాత్రమే పీల్చడం వల్ల వ్యోమగామి శరీరంలోని మొత్తం నైట్రోజన్ తొలగిపోతుంది. నైట్రోజన్‌ను వదలించుకోకపోతే శరీరంలో గ్యాస్ బుడగలు వచ్చి భుజాలు.. మోచేతులు.. మణికట్టు.. మోకాళ్ల నొప్పిని కలిగిస్తాయి. అంతరిక్ష నౌక నుంచి ఎయిర్ లాక్ డోర్ ఉంటుంది. దీని ద్వారా బయటకు వస్తారు. దీనికి రెండు తలుపులు ఉంటాయి. అంతరిక్ష నౌక లోపలికి గాలి రాకుండా ఇవి అడ్డుపడతాయి.

సేఫ్టీ టెథర్

స్పేస్‌వాక్‌కు వెళ్లినప్పుడు మొదటి తలుపు గుండా వెళ్లి దానిని వెనక గట్టిగా లాక్ చేస్తారు. అంతరిక్ష నౌక నుంచి గాలి బయటకు రాకుండా రెండవ తలుపును తెరిచి పెడతారు. ఎయిర్ లాక్ ద్వారా లోపలికి వెళ్లి ఐఎస్ఎస్‌కు బలమైన కేబుల్‌ను ఏర్పాటుచేస్తారు. వీటిని సేఫ్టీ టెథర్ అంటారు. రాక్ క్లయింబర్ తాడుతో తమను తాము సురక్షితంగా రక్షించుకుంటారు. హ్యాండ్ రెయిల్స్.. ఫుట్ రెస్ట్రెయింట్స్ కూడా అంతరిక్షం వెలుపలి భాగంలో ఉపయోగిస్తారు. సురక్షితమైన జెట్ ప్యాక్ అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగామి అన్ టెథర్‌గా మారినప్పుడు జెట్‌తో నడిచే బ్యాక్‌ప్యాక్ ధరిస్తారు. ఇది వారి కదలికలను నియంత్రిస్తుంది.

16 సార్లు న్యూ ఇయర్ వేడుకలు

మనమంతా న్యూ ఇయర్ వేడుకలను ఒకరోజే చేసుకున్నాం. కానీ సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 16సార్లు జరిపారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ అది నిజం. భూమిచుట్టూ దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నప్పుడు “ఎక్స్‌పెడిషన్ 72” టీమ్ క్యాలెండర్ 2025కి మారుతున్నప్పుడు 16 సూర్యోదయాలు.. 16 సూర్యాస్తమయాలు చూస్తుంది. అందుకే వారు 16 సార్లు న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు.

నాసా ఏమి ఇస్తుంది.?

– 1998లో నాసా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ ఎంపికయ్యారు.
– నాసా వ్యోమగాములకు యూఎస్ ప్రభుత్వ జనరల్ షెడ్యూల్‌లోని ఫెడరల్ పే స్కేల్ కింద జీతాలిస్తారు.
– సునీతా విలియమ్స్‌కు అవసరమైన సమగ్ర ఆరోగ్య బీమాను నాసా అందిస్తుంది.
– అన్ని రకాల రవాణా సౌకర్యాలను ఉచితంగా అందిస్తుంది.
– వృత్తిపరంగా.. మిషన్ సమయంలో అన్ని రకాల ఇన్సూరెన్సులు కల్పిస్తుంది.
– అంతరిక్ష యాత్రకు బయల్దేరే ముందు.. యాత్ర జరుగుతున్న సమయంలో సునీతతో పాటు కుటుంబానికి మానసిక మద్దతు కల్పిస్తుంది.
అంతరిక్షంలో ఆహారం.?
– సునీతా విలియమ్స్ అంతరిక్షంలో పౌడర్ రూపంలో ఉన్న ఆహారం తీసుకున్నారు.
– పాలు.. పిజ్జా.. రొయ్యల కాక్ టెయిల్స్.. రోస్ట్ చికెన్.. ట్యూనా వంటివి స్పేస్‌లో ఆమె రెగ్యులర్ మెనూ.
– తాజా పండ్లు.. కూరగాయలు తక్కువ మోతాదులో తీసుకున్నారు.
– ప్రతీ మూడు నెలలకోసారి నాసా ఐఎస్ఎస్‌కు చేరవేస్తుంది.
– పండ్లు.. కూరగాయలు ప్యాకింగ్ చేస్తారు.
– ఆహార పదార్థాలు ఎండిన.. గడ్డకట్టిన స్థితిలో ఉంటాయి.
– మాంసం.. గుడ్లు అన్నింటినీ భూమిపైనే వండుతారు. అంతరిక్షంలో ఫుడ్ వార్మర్ ద్వారా వేడిచేసుకోవచ్చు.
– అయస్కాంతీకరణ మెటల్ ట్రేలలో ఆహారాన్ని తింటారు.
– డీహైడ్రేట్ సూప్‌లు.. క్యాసరోల్స్‌లకు అవసరమైన నీటిని స్పేస్ స్టేషన్లలో ఉండే 530 గ్యాలన్ల ట్యాంక్ నుంచి తీసుకుంటారు.
– క్రిస్మస్​సమయంలో అంతరిక్షంలో వ్యోమగాములు థాంక్స్ గివింగ్ విందు చేసుకున్నారు. నాసా వారికి పంపిన బటర్నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డినెస్ (చేపలు), స్మోక్డ్ టర్కీ(బేక్ చేసిన చికెన్) వంటి ఆహార పదార్థాలను వ్యోమగాములు పంచుకున్నారు.
సునీతకు భారత మూలాలు

సునీత అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించారు. తండ్రి దీపక్ పాండ్య స్వస్థలం గుజరాత్​కాగా, తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశానికి చెందిన వారు. ముగ్గరు సంతానంలో చివరి వారైన సునీత అమెరికాలోని నావల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. నౌకాదళంలో, నేవీ ఏవియేషన్‌లోనూ పని చేశారు. యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. 1998లో నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేయగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. గతంలో ఆమె నాలుగు నెలల పాలు అంతరిక్ష కేంద్రంలో గడిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.