Supreme court: ఎన్ని దరఖాస్తులు దాఖలైనా సరే.. జగన్‌పై విచారణ ఆపొద్దు

www.mannamweb.com


జగన్‌ అక్రమాస్తుల కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆదేశించారు.

దిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతున్నందున వాటి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైకాపా ఎంపీగా ఉన్నప్పుడు (ప్రస్తుత తెదేపా ఎమ్మెల్యే) రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కేసులపై జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ మహదేవన్‌లతో కలిసి బుధవారం ఆయన విచారణ చేపట్టారు. రఘురామ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ.. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణలో ఎలాంటి పురోగతీ లేదన్నారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని 12వ పేరా చూస్తే దిగ్భ్రాంతికి గురవుతారని పేర్కొన్నారు. జస్టిస్‌ ఖన్నా స్పందిస్తూ తాను సీబీఐ నివేదిక చూశానని, బాధ కలిగించిందని చెప్పారు. విచారణ కోర్టులో వరుసగా దాఖలవుతున్న దరఖాస్తుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ మొదలుపెట్టాలని ఆదేశించారు. ఇతరత్రా విషయాల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు.

విచారణ నవంబరుకు వాయిదా

ఆ ఉత్తర్వు తప్పు, ఈ ఉత్తర్వు తప్పు అని సీఆర్‌పీసీ సెక్షన్‌ 305, 317, 205ల కింద ప్రతి వాదులు దరఖాస్తులు దాఖలు చేస్తున్నారంటే ఎలా? కేసుల విచారణ జరిపే విధానం ఇదేనా?

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

సీబీఐ.. ప్రత్యేక న్యాయవాదిని పెట్టుకోవాలి

జగన్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదిస్తూ ఈ కేసులో 900 మంది సాక్షులు, లక్షల పేజీల దస్త్రాలు ఉన్నాయని చెప్పారు. కేసుల విచారణలో అలాంటివన్నీ ఉంటాయని, అందువల్ల సీబీఐ ఈ కేసు కోసమే ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని జస్టిస్‌ ఖన్నా సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారని రోహత్గీ గుర్తుచేశారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కేసు విచారణ జాప్యానికి కారణాలు చెప్పొచ్చని, మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆరుగురు న్యాయమూర్తులు డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ చేపట్టిన తర్వాత తీర్పు వెలువరించకుండానే బదిలీ అయ్యారని, దాంతో ప్రతిసారీ ఈ కేసు మళ్లీ మొదటికొస్తోందని రఘురామ తరఫు న్యాయవాది చెప్పారు. 900 మంది సాక్షులున్న ఇలాంటి కేసుల్లో సమయం పడుతుందని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణకు కొన్నిసార్లు ఒకరోజు పడితే, మరికొన్నిసార్లు పక్షం రోజులు పడుతుందన్నారు. భోజన విరామం తర్వాత కోర్టు తిరిగి ప్రారంభం కాగానే ఈ కేసు విచారణను నవంబరు 11తో ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేశారు.

విచారణ కోర్టులను నియంత్రించలేం: రఘురామ న్యాయవాది జోక్యం చేసుకుంటూ హైకోర్టు ఆదేశాల మేరకు డిశ్ఛార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడుతున్నారని జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు చెబుతున్నారని, వాటిపై విచారణ పూర్తయిన వెంటనే విచారణ ముగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తాము విచారణ కోర్టులను నియంత్రించలేమని జస్టిస్‌ ఖన్నా తేల్చిచెప్పారు. తాను ఈ కేసులో సీబీఐకి చెప్పాల్సింది స్పష్టంగా చెప్పానని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి, సాధ్యమైనంత త్వరగా విచారించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై వందల కేసులు ఉన్నాయని, వాటన్నింటినీ తాము ఎలా నియంత్రించగలమని ప్రశ్నించారు. కేసుల విచారణ ప్రారంభం కావాల్సిందేనని స్పష్టం చేశారు. జగన్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఈ కేసు దాఖలు చేసిన వ్యక్తి (రఘురామకృష్ణరాజు)పైనా బ్యాంకులను రూ.800 కోట్ల దాకా మోసం చేసినందుకు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ధర్మాసనం ముందుకొచ్చి బోధనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తన కేసులో ఏం జరుగుతోందో ముందు చెప్పాలన్నారు. రఘురామ న్యాయవాది స్పందిస్తూ వారికి (జగన్‌కు) సమస్యంతా మెసెంజర్‌తో తప్పితే మెసేజ్‌తో లేదని వ్యాఖ్యానించారు.