అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నాడు ఇంట్లో ఇలా చెయ్యండి.. ప్రధాని మోడీ పిలుపు!!

హిందువుల శతాబ్దాల కల అయిన అయోధ్య బాలరాముని ప్రతిష్టపై ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యను ఎంతో సామరస్యంగా పరిష్కరించి ప్రస్తుతం అయోధ్య శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవం చేస్తున్న కారణంగా హిందువులంతా ఆనంద తన్మయత్వంతో ఉన్నారు.
ఇక అయోధ్య రాముడి అక్షింతలు ఇంటింటికీ పంపిణీ జరుగుతున్న క్రమంలో దేశ వ్యాప్తంగా జై శ్రీరాం అంటూ జనం ఊగిపోతున్నారు.


రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించటానికి తెగ తాపత్రయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి అనుబంధంగా దేశ వ్యాప్తంగా ఆలయాలను శుభ్రం చెయ్యాలని ప్రధాని మోడీ పిలుపునివ్వటంతో ఆలయాలను శుద్ధి చేస్తున్నారు. ఇక అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం నాడు కూడా దేశ ప్రజలంతా చెయ్యవలసిన విధులను పండితులు ఇప్పటికే చెప్పారు.

అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టంగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు అయిన జనవరి 22 న తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ మత పెద్దలు చెబుతున్నారు. కాలకృత్యాల అనంతరం స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తరువాత సీతారామ, లక్ష్మణ, భరత, శతృఘ్న సమేత ఆంజనేయుడికి షోడశోపచార పూజలు చేయాలి.

పానకం, వడపప్పు నైవేద్యం సమర్పించాలని చెప్తున్నారు . పండ్లు, టెంకాయ మొదలైనవి సమర్పించాలి. జైశ్రీరాం అంటూ నగర సంకీర్తన చేస్తే చాలా మంచిది. అభిజిత్ ముహూర్తం వరకు దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాలి. ఐదు దీపాలను తప్పకుండా వెలిగించాలని చెప్తున్నారు. ఆ రోజు విధిగా హిందువులంతా రామయ్యను మనసులో నిలుపుకుని పూజాధికాలు చెయ్యాలి.

ఇక మరోవైపు ఈ నెల 22న జరగనున్న అయోధ్య బాల రాముని ప్రతిష్టా కార్యక్రమాన్నిపురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరూ రాముడు చూపిన బాటలో నడవాలన్నదే తమ ఉద్దేశమని మోడీ వెల్లడించారు.రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననుండటం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు.