ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త

 వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కుదిరితే యవ్వనంగా కనిపించాలని కూడా ఆశ పడతారు. ఇందులో తప్పేమీ లేకపోయినప్పటికీ అందాన్ని, యవ్వనాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో చాలా మందికి తెలియదు.


దీనికి తోడు తెలీకుండా చేసే కొన్ని పొరపాట్లు అకాల వార్ధక్యాన్ని తెచ్చి పెడతాయి. మరి చాలా మంది తెలీకుండానే ఉదయం పూట చేసే మిస్టేక్స్ ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం లేవగానే ఏం చేస్తామనే విషయాలు రోజు మొత్తం శరీరంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఆరోగ్యంగా యవ్వన కాంతులతో ఉండగలమో లేదో కూడా ఇవే నిర్ణయిస్తాయి.

ఉదయం పూట అల్పాహారాన్ని అప్పుడప్పుడూ మిస్ చేస్తున్నారంటే అకాల వార్ధక్యాన్ని ఆహ్వానించినట్టే. దీని వల్ల దీర్ఘకాలంలో ఒంట్లో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు ఎగుడుదిగుడులకు లోనై చివరకు జీవక్రియలు మందగిస్తాయి. ఇది చివరకు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ముసలితనపు ఛాయలు వచ్చి పడేలా చేస్తుంది.

కొందరు ఉదయం లేవగానే ఫోన్‌ను చెక్ చేస్తుంటారు. ఇదీ చెడు అలవాటేనని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్స్ వెలువరించే నీలికాంతి శరీరంలోని ఆందోళనకారక హార్మోన్‌ల స్థాయిని పెంచి ఏకాగ్రత చెదిరేలా చేస్తుంది. రాత్రి నిద్రపై కూడా ప్రభావం చూపిస్తుంది. చిన్న తనంలోనే ముసలితనపు ఛాయల బారిన పడేలా చేస్తుంది.

దాదాపు ఆరు ఏడు గంటలు పాటు నిద్రపోయి లేచాక శరీరం డీహైడ్రేషన్‌కు లోనవుతుంది. ఇలాంటప్పుడు లేవగానే కాఫీ తాగితే డీహైడ్రేషన్ మరింత పెరిగి శరీరం సున్నితత్వాన్ని కోల్పోతుంది. చివరకు చర్మ సౌందర్యం కూడా దెబ్బతింటుంది.

ఎక్సర్‌సైజులు అంతగా చేయని వారు, సూర్యరశ్మీకి దూరంగా నిత్యం నాలుగు గోడల మధ్యే పరిమితమయ్యే వారికీ అకాల వృద్ధాప్య ముప్పు ఎక్కువ. ఇలాంటి వారిలో హార్మోన్‌ల సమతౌల్యత దెబ్బతింటుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. అంతిమంగా ముసలితనపు ఛాయలు వచ్చిపడతాయి.

ఉదయం పూట హావుడిగా గడుపుతూ ఒత్తిడికి లోనయ్యే వారిలో కూడా అకాల వృద్ధాప్యం తప్పదు. ఇలాంటి వారిలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువవుతంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.