కాళ్లు, చేతుల్లో తిమ్మిరి వస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. ఇలా చేస్తే వెంటనే..

కాళ్లు, పాదాలు, చేతుల్లో తరచుగా వచ్చే తిమ్మిరి చాలా మందిని వేధించే సాధారణ ఆరోగ్య సమస్య. ఇది తాత్కాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. ఈ సమస్య వెనుక ప్రధానంగా నరాల దెబ్బతినడం, రక్త ప్రసరణలో సమస్యలు లేదా ఇతర అనారోగ్యాలు కారణం కావచ్చు.


తిమ్మిరి సమస్యను ఎలా గుర్తించాలి..? చికిత్స ఏంటిది..? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తిమ్మిరి ప్రధాన కారణాలు:

శరీరంలోని మెదడు, వెన్నుపూస వెలుపల ఉన్న నరాలు దెబ్బతినడం వల్ల తిమ్మిరి వస్తుంది. దీనిని వైద్య పరిభాషలో పెరిఫెరల్ న్యూరోపతి అని పిలుస్తారు. ఈ సమస్యకు ప్రధాన కారణాలు:

డయాబెటిస్: అధిక రక్తంలో చక్కెర స్థాయిలు నరాలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కాళ్లు, పాదాలలో తిమ్మిరిని కలిగిస్తాయి.

విటమిన్ లోపం: శరీరంలో ముఖ్యంగా విటమిన్ B12 లోపం ఉంటే నరాల ఆరోగ్యం దెబ్బతిని తిమ్మిరి వస్తుంది.

అధిక మద్యపానం: ఎక్కువ మద్యం తాగేవారిలో నరాల దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.

ఆటోఇమ్యూన్ వ్యాధులు: కొన్ని ఆటోఇమ్యూన్ వ్యాధులు నరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు గిల్లన్-బారె సిండ్రోమ్.

రక్త ప్రసరణ సమస్యలు: అధిక కొలెస్ట్రాల్ లేదా రక్తనాళాలు ఇరుకుగా మారడం వల్ల కాళ్లు, పాదాలకు రక్త ప్రసరణ సరిగా జరగక తిమ్మిరి వస్తుంది.

గాయాలు: నరాలకు దెబ్బతగలడం వల్ల కూడా తిమ్మిరి లక్షణాలు కనిపిస్తాయి.

తిమ్మిరి లక్షణాలు:

తిమ్మిరి లక్షణాలు దాని కారణంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా కనిపించే లక్షణాలు:

శరీర భాగంలో జలదరింపు, మంట లేదా సూదులతో గుచ్చినట్లు అనిపించడం.

కండరాల బలహీనత లేదా పట్టు కోల్పోవడం.

నడిచేటప్పుడు సమతుల్యత కోల్పోవడం.

రక్తపోటు మార్పులు, గుండె రేటులో హెచ్చుతగ్గులు లేదా మూర్ఛ వంటి లక్షణాలు కూడా తీవ్రమైన కేసుల్లో కనిపించవచ్చు.

ఈ లక్షణాలు నిరంతరంగా ఉండవచ్చు లేదా అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు.

చికిత్స – నివారణ మార్గాలు:

తిమ్మిరి చికిత్స దాని మూల కారణంపై ఆధారపడి ఉంటుంది.

డయాబెటిస్ నియంత్రణ: డయాబెటిస్ వల్ల తిమ్మిరి వస్తే, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. దీనికోసం ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

విటమిన్ సప్లిమెంట్లు: విటమిన్ B12 లోపం ఉంటే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లు తీసుకోవాలి.

జీవనశైలి మార్పులు: ధూమపానం మానేయడం, మద్యపానం తగ్గించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

మందులు – థెరపీ: నరాల నొప్పిని తగ్గించడానికి కొన్ని మందులు, ఫిజియోథెరపీ లేదా ఆల్టర్నేటివ్ థెరపీలు సహాయపడతాయి. సిరీయస్ కేసులలో, శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.

తిమ్మిరి ఒక సాధారణ సమస్యగా అనిపించినా, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. లక్షణాలు తీవ్రంగా లేదా నిరంతరంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన పోషకాహారం మరియు సకాలంలో వైద్య పరీక్షలు తిమ్మిరి నుండి రక్షణ పొందడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.