Pigeons : మీ నివాస ప్రాంతంలో పావురాలు ఉన్నాయా..? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!

Pigeons : చూడటానికి ముచ్చటగా, ముద్దుగా ఉండే పావురాలంటే ఎవరికైనా ఇష్టమే. మన పల్లెటూళ్లలో చాలామంది వాటిని ఇష్టంగా పెంచుకోవటం తెలిసిందే. ఇక.. పట్టణాల్లో కొన్ని చౌరస్తాల్లో వాటికి రోజూ గింజలు వేసేవారినీ చూస్తుంటాం.
అయితే.. ఈ పావురాల పట్ల వీరికున్న ప్రేమే.. వారి ప్రాణాల మీదికి తీసుకొస్తోందని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శీతాకాలంలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలకు చలి వాతావరణంతో బాటు పావురాలే ప్రధానకారణమని వారు చెబుతున్నారు. సినీనటి మీనా భర్త పావురాల వల్ల సోకిన ఇన్ఫెక్షన్ వలనే చనిపోయారనే వార్తలు కూడా ఆ మద్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.


మన ఊపిరితిత్తులు పెద్ద ట్యాంక్‌లాగా పనిచేస్తాయి. నిమిషంలో 10 లీటర్ల చొప్పున.. ఒక రోజులో 14,400 లీటర్ల గాలిని అవి తీసుకుంటాయి. ఈ గాలిలో దుమ్ము, ధూళి, పక్షుల, జంతువుల శరీరం నుంచి వెలువడే వ్యర్థాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పావురాలు ఎగిరినప్పుడు దాని రెక్కల నుంచి విడుదలయ్యే గాలి, అవి వేసే రెట్టల్లో కొన్ని ప్రొటీన్లు గాలిలోకి విడుదలవుతాయి.
ఈ ప్రొటీన్లు ఆ పావురాలు ఎగిరే ప్రాంతాల్లో చాలా రోజుల పాటు అలానే గాలిలో తేలుతూ ఉంటాయి. తద్వారా అక్కడ నివసించే వారి, ఆ ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపే వారి లంగ్స్‌లో అవి చేరతాయి. రోగనిరోధక శక్తి బాగున్న వారిలో ఇవి నెలలు, సంవత్సరాల పాటు అలాగే నిద్రాణంగా ఉండి.. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధిగా మారుతుంటాయి.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ పక్షుల వ్యర్థాలు మోసుకొచ్చిన ప్రమాదకరమైన వైరస్‌ను కట్టడి చేసే శక్తి ఉండదు. దీనికి తోడు.. చలికాలపు వాతావరణంలో ఈ వైరస్‌లు వేగంగా పెరిగి వారం రోజుల్లోనే అది లంగ్స్‌లో బలంగా తిష్టవేస్తుంది. దీన్నే హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ అంటారు.

ఈ హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ బలహీనమైన రోగనిరోధక శక్తి, ఏదైనా శ్వాసకోశ సమస్యలున్న వారి ఊపిరితిత్తులను వేగంగా దెబ్బతీస్తుంది. దీంతో వారి లంగ్స్‌లోని వాయుకోశాలను కుచించుకుపోయి, లంగ్స్ మూసుకుపోవటం మొదలవుతుంది. దీనివల్ల బాధితులు గాలిపీల్చుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. వైద్యపరిభాషలో ఈ ఇబ్బందికర పరిస్థితిని ‘ఫైబ్రోసిస్’ అంటారు. దీని బారినపడిన వారు నాలుగడుగులు వేగంగా వేసినా ఆయాసం వస్తుంటుంది.

మన ఊపిరితిత్తులలో 30 కోట్ల వరకు వాయుకోశాలు ఉంటాయి. పావురాల కారణంగా వ్యాపించే వైరస్.. వీటిలో 50 – 70 లక్షల వాయుకోశాలను ప్రభావితం చేసేవరకు పరిస్థితి అదుపులోనే ఉంటుంది. ఆ తర్వాత అది వేగంగా మిగిలిన వాయుకోశాల పనితీరును దెబ్బతీస్తుంది. ఆస్తమా, న్యుమోనియా వంటి రోగుల్లో ఈ వైరస్ 20 నుంచి 25 కోట్ల వాయుకోశాలను దెబ్బతీసి, ఈ వ్యక్తి మరణానికి కారణమవుతుంది.
జన్యుపరమైన అలెర్జీలు, ఉబ్బసం తదితర సమస్యలున్న వారు పొరబాటున కూడా పావురాలను, పెంపుడు జంతువులను పెంచటం, వాటితో సమయం గడపటం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదమని వారు సూచిస్తున్నారు. మీ నివాస ప్రాంతంలో పావురాలుంటే తప్పక మాస్క్ ధరించాలని, ఇంటి బాల్కనీల్లో పావురాలు రాకుండా నెట్ వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పౌల్ట్రీ పరిశ్రమ, పావురాలను పెంచేవారు, పెద్దసంఖ్యలో పావురాలుండే కాలనీ వాసుల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల రోగాల బారిన పడుతున్నట్లు గణాంకాలను బట్టి తేలుతోందనీ, రోగుల్లో శ్వాస సమస్యలు, అవి ముదిరి తీవ్రమైన ఫైబ్రోసిస్‌గా మారుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చలికాలం ప్రభావం, మితిమీరిన కాలుష్యం నేపథ్యంలో దేశంలో హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి పావురం రెట్టలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలున్నవారు తక్షణం వైద్యులను కలవాలనీ, X Rayలలో ఫైబ్రోసిస్‌ను గుర్తించవచ్చని వారు సూచిస్తున్నారు.