మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. ముఖ్యంగా ఉదయం టిఫిన్ రూపంలో అనేక పదార్థాలను తింటాం. అయితే కొన్ని ప్రాంతాలకు చెందిన వారు మరమరాలతోనూ టిఫిన్లను తయారు చేసి తింటారు. రాయలసీమ వారు ఎక్కువగా వీటితో ఉగ్గాని తయారు చేసి తింటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే వాస్తవానికి మరమరాల వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. అందువల్ల మనం తక్కువ ఆహారం తింటాం. దీంతో అధిక బరువును తగ్గించుకోవడం చాలా తేలికవుతుంది.
మరమరాలను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి అధిక బరువును తగ్గిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిని తింటే మలబద్దకం అన్నది ఉండదు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. మరమరాలను తినడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. దీంతో నీరసం, అలసట నుంచి త్వరగా బయట పడవచ్చు. అయితే మరమరాలను ఉపయోగించి మనం దోశలను కూడా తయారు చేయవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో, వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మరమరాల దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
మరమరాలు – 2 కప్పులు, బొంబాయి రవ్వ – అర కప్పు, పెరుగు – అర కప్పు, శనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, వంట సోడా – పావు టీస్పూన్, నూనె – పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, క్యాప్సికం తరుగు – పావు కప్పు, నిమ్మకాయ – సగం.
మరమరాల దోశలను తయారు చేసే విధానం..
మరమరాలను ఒక గిన్నెలో వేసుకుని మునిగేలా నీళ్లు పోయాలి. మరో గిన్నెలో బొంబాయి రవ్వ, పెరుగు తీసుకుని కలిపి పెట్టుకోవాలి. పావు గంటయ్యాక మరమరాలను గట్టిగా పిండి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ మిశ్రమం, గోధుమ పిండ, శనగ పిండి, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకుని వంటసోడా వేసి, నిమ్మరసం పిండి కలిపి మూల పెట్టాలి. 20 నిమిషాలు అయ్యాక స్టవ్ మీద పెనం పెట్టి ఈ పిండిని దోశలా వేయాలి. దానిపై ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, క్యాప్సికం ముక్కలు చల్లాలి. తరువాత నూనెతో ఎర్రగా కాల్చాలి. ఇలాగే మిగిలిన పిండితో దోశలను వేయాలి. దీంతో వేడి వేడిగా ఉండే మరమరాల దోశలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా చట్నీతో కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.