ఆల్కహాల్ ప్రపంచంలో బీర్, బ్రాందీ, విస్కీ, జిన్, వోడ్కా, టకీలా, రమ్ ప్రత్యేకమైనవి. వీటిని ఆయా పరిస్థితులను బట్టి, అభిరుచులను బట్టి సేవిస్తుంటారు.
అయితే, ఈ లిక్కర్ వరల్డ్లో విస్కీ ప్రత్యేకంగా చెప్పాలి. మిగతా మద్యం కన్నా కాసింత సాఫ్ట్గా ఉంటుందని మద్యపాన ప్రియులు బాగా ఇష్టపడతారు. అయితే, మామూలు విస్కీ కన్నా స్కాచ్ విస్కీని అయితే ఓ రేంజ్లో ఆస్వాదిస్తారు. అయితే, చాలా మందికి విస్కీకి, స్కాచ్ విస్కీకి మధ్య తేడా ఏంటో తెలియదు. విస్కీకి, స్కాచ్ విస్కీకి మధ్య చాలా తేడాలున్నాయి. అవేంటో ఈ కథనం పూర్తిగా చదివితే మీకే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ తేడాలేంటో తెలుసుకుందాం.
స్కాచ్ అంటే విస్కీనే – కానీ ప్రతీ విస్కీ స్కాచ్ కాదని తెలుసా?
విస్కీ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. విస్కీ (Whisky)ని బార్లీ, మొక్కజొన్న, రై, గోధుమ వంటి ధాన్యాల ద్వారా తయారు చేస్తారు. వాటిని పీపాల్లో పక్వం (Aging) చేసిన ఏ డిస్టిల్డ్ స్పిరిట్ అయినా విస్కీగా పిలుస్తారు. ఈ విస్కీని ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తారు. అమెరికా, ఐర్లాండ్, కెనడా, జపాన్, ఇండియా సహా ప్రపంచంలో చాలా దేశాలు ఈ తరహా విస్కీని తయారు చేస్తాయి. అమెరికన్ విస్కీ అని, ఐరిష్ విస్కీ అని, కెనడియన్ విస్కీ అని వీటిని ఆ దేశాల్లో తయారీని బట్టి పిలుస్తారు.
స్కాచ్ విస్కీకి ఎన్నో ప్రత్యేకతలు
స్కాచ్ విస్కీ ప్రపంచంలోనే ప్రత్యేకమైన బ్రాండ్. స్కాచ్ అనేది ఓ చట్టబద్దమైన హోదా. దీని తయారీకి కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఈ స్కాచ్ను స్కాట్లాండ్లోనే తయారు చేయాలి. పక్వం (Aging) కచ్చితంగా స్కాట్లాండ్లో, కనీసం 3 సంవత్సరాలు ఓక్ పీపాల్లో పక్వం చెందాలి. స్కాచ్ తయారీకి కేవలం మాల్టెడ్ బార్లీ (Malted Barley) ఉపయోగించాలి. అలా తయారు చేసిన విస్కీనే స్కాచ్ విస్కీగా పిలుస్తారు.
స్కాచ్ తయారీలో కఠిన నిబంధనలు అమలు
స్కాచ్ (Scotch) అనేది ప్రత్యేక చట్టబద్ధమైన హోదా. దీని తయారీకి కఠిన నిబంధనలు ఉన్నాయి. ‘స్కాచ్ విస్కీ రెగ్యులేషన్స్ 2009’ (Scotch Whisky Regulations 2009) ద్వారా వీటిని అమలు చేస్తారు. ఇంతలా స్కాచ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం స్కాటిష్ గవర్నమెంట్ అమలు చేసే కఠిన చట్టాలే కారణంగా చెప్పవచ్చు. స్కాచ్ తయారీలో తప్పుడు విధానాలను నియంత్రించేందుకు అమలు చేసే కఠిన నిబంధనలు ప్రధానంగా నాలుగు ఉన్నాయి.
స్కాచ్ తయారీని నియంత్రించే కఠినమైన నిబంధనలు ఇవే
స్కాచ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడానికి కారణం, స్కాటిష్ ప్రభుత్వం విధించిన కఠిన చట్టాలే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం:
1. భౌగోళిక రక్షణ (Geographical Indication): స్కాచ్కు చట్టబద్ధమైన భౌగోళికంగా గుర్తింపు ఉంది. స్కాట్లాండ్ దేశం వెలుపల ఉత్పత్తి అయిన ఈ పానీయాన్ని స్కాచ్గా పిలవడానికి అవకాశం లేదు. అలాంటి చట్టబద్ధత ఉంది.
2. ఆల్కహాల్ శాతం: స్కాచ్ను బాటిల్లో నింపే సమయానికి కనీసం 40% ఆల్కహాల్ బై వాల్యూమ్ (ABV) ఉండాలి. మిగతా విస్కీలు కొన్ని సార్లు ఈ శాతంలో మార్పు చేస్తాయి. కానీ స్కాచ్లో మాత్రం ఆ తేడాలు అనుమతించబడవు.
3. జోడించిన పదార్థాలు: నీరు, సాధారణ కారామెల్ రంగు (E150A) మినహా మరే ఇతర పదార్థాలను స్కాచ్కు తయారీ సందర్భంగా కలపడానికి స్కాట్లాండ్ చట్టాలు అంగీకరించవు. కానీ ఇతర విస్కీ తయారీదారులు రుచి కోసం, ఇతర ఫ్లేవర్స్ కోసం చక్కెర, కొన్ని రకాల మూలకాలు, కొన్ని రకాల పండ్లు కలుపుతారు. కానీ స్కాచ్లో నీరు, సాధారణ కారామెల్ రంగు మాత్రమే కలపాల్సి ఉంటుంది.
4. పీపా పరిమితి: పక్వం (Aging) కోసం ఉపయోగించే ఓక్ పీపాలు 700 లీటర్ల సామర్థ్యాన్ని మించకూడదు. దీనివల్ల స్కాచ్ స్వచ్ఛత, రుచి, నాణ్యతను కాపాడటం, ఓక్ పీపాలో 700 లీటర్లు నిల్వ చేసే చారిత్రాత్మక సంప్రదాయాన్ని అమలు చేయడం కోసం ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు.
ఇదంతా చదివిన తర్వాత స్కాచ్ విస్కీ అనేది మామూలు విస్కీ కాదని మీకు అర్థం అయ్యే ఉంటుంది. స్కాట్లాండ్ చట్టాలు, సంప్రదాయ తయారీ విధానం, చట్టబద్ధమైన బౌగోళిక గుర్తింపు, నిల్వ చేసే విధానం, పీపా లో పక్వం చేసే పద్ధతులు స్కాచ్ కు ఓ గౌరవం, ఓ గుర్తింపు కలిగిస్తోంది. అందుకే సాధారణ విస్కీతో పోల్చితే స్కాచ్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కలిగింది. ఈ తేడాలు గమనించారు కదా. ఇక మీ తదుపరి సిప్ ను ఆస్వాదించండి. అయితే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మాత్రం మరిచిపోకండి సుమా.




































