ఆగస్టు 15, 2025 న భారత్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవంను ఘనంగా జరుపుకోనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది.
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మూడు రంగులకు సంబంధించి అందరికీ తెలిసినా, పతాక మధ్యభాగంలో ఉన్న అశోక చక్రం, దాని 24 ఆకుల (గీతలు) వెనుక ఉన్న అర్థం చాలా మందికి అంతగా తెలియదు. పతాకంలోని తెలుపు రంగు మధ్య పట్టీపై నావీ బ్లూ రంగులో ఉన్న ఈ చక్రం, ధర్మచక్రం (Dharmachakra)గా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశపు ప్రాచీన వారసత్వాన్ని గుర్తు చేసే ప్రతీక. అశోక చక్రం సారనాథ్‌లోని సింహస్తంభం (Sarnath Lion Capital) నుండి స్ఫూర్తి పొందింది. అది మన జాతీయ చిహ్నం కూడా. 1947 జూలై 22న దీన్ని అధికారికంగా భారత పతాకంలో చేర్చారు.
భారత పతాక నియమావళి (Flag Code of India, 2002) ప్రకారం.. మధ్య పట్టీ తెలుపు రంగులో ఉండి, దాని మధ్యలో నావీ బ్లూ రంగులో 24 సమాన ఆకుల (గీతలు) గల అశోక చక్రం ఉండాలి. ఇది స్క్రీన్ ప్రింట్, స్టెన్సిల్, ఎంబ్రాయిడరీ వంటి పద్ధతుల్లో స్పష్టంగా ఇరువైపులా కనిపించేలా ఉండాలి. అశోక చక్రంలోని 24 ఆకుల (గీతలు) నీతిమంతం, న్యాయం, నిజాయితీ, మంచి పాలన వంటి 24 విలువలకు ప్రతీక. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పాత త్రివర్ణ పతాకంలో చరఖా ఉండేది. అది స్వావలంబన, వలస పాలనకు వ్యతిరేక పోరాటానికి ప్రతీక. స్వాతంత్య్ర అనంతరం చరఖా స్థానంలో అశోక చక్రాన్ని ఉంచారు. ఇది జీవితం ఎప్పుడూ కదలికలో ఉండాలి.
వీటిని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే.. హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కొనసాగించిన 24 ఋషులను సూచిస్తాయి. అలాగే వేద మంత్రాలలో గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు ప్రతీకగా చెబుతారు. అంతేకాకుండా.. రోజులోని 24 గంటలకు సంకేతం, జీవితం ఎప్పుడూ చలనంలో ఉండాలని గుర్తు చేస్తుంది.
త్రివర్ణ పతాకంలోని కాషాయం రంగు ధైర్యం, త్యాగంలకు ప్రతీకలు కాగా, తెలుపు శాంతి, సత్యంలకు ప్రతీకలు. అలాగే ఆకుపచ్చ సస్యశ్యామలం, అభివృద్ధిలకు ప్రతీకలు. ఇక నావీ బ్లూ అశోక చక్రంలోని 24 ఆకుల (గీతలు) అర్థం ఇలా ఉన్నాయి.
* ప్రేమ (Love)
* ధైర్యం (Courage)
* సహనం (Patience)
* శాంతి (Peace)
* త్యాగం (Sacrifice)
* కరుణ (Compassion)
* సత్యం (Truth)
* ధర్మం (Righteousness)
* న్యాయం (Justice)
* సౌహార్దం (Harmony)
* సమానత్వం (Equality)
* సత్సంకల్పం (Goodwill)
* స్నేహం (Friendship)
* స్వీయ నియంత్రణ (Self-control)
* ఉదారత (Generosity)
* స్వాతంత్య్రం (Freedom)
* నీతి (Morality)
* సహకారం (Cooperation)
* కృతజ్ఞత (Gratitude)
* క్షమ (Forgiveness)
* జాగ్రత్త (Alertness)
* శ్రద్ధ (Devotion)
* కృషి (Effort/Diligence)
* ప్రగతి (Progress)
ఇలా, భారత త్రివర్ణ పతాకం ప్రతి అంశం మన చరిత్ర, తత్త్వం, భవిష్యత్తు దిశను ప్రతిబింబిస్తూ ఒక సమగ్ర కథ చెబుతుంది.
































