నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల్లో భార్యతో పాటు భర్త చేతిలోనూ ఫోన్ లేకుండా ఉండడం లేదు. ఇలాంటి సమయంలో ఫోన్ చూడడానికి వారి పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు. కేవలం ఇష్టం మాత్రమే కాకుండా వాటికి బానిసగా మారిపోయారు. కొందరు మొబైల్ లేకుండా ఆహారం తీసుకోవడం లేదు. మరికొందరు నిద్రించే ముందు మొబైల్ తోనే ఉంటున్నారు. ఇలా నిత్యం ఫోన్ వాడడం వల్ల చిన్న వయసులోనే వారి కళ్ళకు అనేక సమస్యలు వస్తున్నాయి. ఆ తర్వాత పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా బాధపడాల్సి వస్తుంది. అయితే పిల్లలు మొబైల్ ముట్టకుండా ఉండాలంటే ఇలా చేసి చూపించాలి..
ఇటీవల కొన్ని పాఠశాలల్లో చిన్నపిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి జీవితం గురించి తెలుపుతున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసేది మొబైల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువసార్లు మొబైల్ చూస్తూనే గడుపుతున్నారు. అయితే మొబైల్ వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. కానీ పిల్లలకు తెలియదు. వారికి మాటలతో చెబితే అర్థం కాదు. అలాంటప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. ఆ విధంగానే ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు ఫోన్ చూడడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో అద్భుతంగా తెలియజేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
ఒక పిల్లవాడు నిత్యం ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఆహారం తీసుకోమన్నా తీసుకోడు.. మొబైల్ పక్కన ఉంటేనే ఆహారం తీసుకుంటాడు. అలాగే నిద్రించేముందు కూడా తప్పనిసరిగా మొబైల్ ఉండాలని మారం చేస్తాడు. అలాగే మొబైల్ లేకుండా ఉండలేకపోతుంటాడు. ఇలాంటి సమయంలో ఆ పిల్లవాడిని ఒక రూములోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత బయటకు తీసుకొస్తారు. ఇలా బయటకు వచ్చిన పిల్లవాడికి ఒక కన్నుకు ఒక క్యాప్ తగిలించి ప్లాస్టర్ వేస్తారు. అంటే ఒక కన్ను తీసేస్తే ఎలా డ్రెస్సింగ్ చేస్తారో అలా ఆ పిల్లవాడిని తయారు చేస్తారు.
ఈ సీన్ మొత్తం జరిగిన తర్వాత అక్కడ ఉన్న మిగతా పిల్లలకు ఫోన్ ఇస్తారు. అయితే ఫోన్ వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుసుకున్న వారు.. ఆ మొబైల్లో తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కొందరైతే మొబైల్ చూడగానే వణికి పోతారు. ఇలా వారు మొబైల్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.
ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మొబైల్ ఇవ్వమని లేదా మొబైల్ లేకుండా తాము అన్నం తినమని పిల్లలు మారం చేస్తే.. ఈ విధంగా ప్రాక్టికల్ గా చేసి చూపించాలని కోరుతున్నారు. అయితే కొందరు తల్లిదండ్రులు ఫోన్ వద్దని వారిని తిడుతూ ఉంటారు. అంతేకాకుండా కొందరు చేయి కూడా చేసుకుంటారు. అలా చేయడం వల్ల వారు మరింత కఠినంగా తయారై.. మనసు పాడైపోతుంది. ఇలా వారికి అర్థమయ్యే విధంగా చేస్తే మరోసారి జీవితంలో ఫోన్ పట్టుకోవడానికి భయపడతారు.
































