చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఏం చేయాలో తెలుసా..? నిబంధనలు తెలిస్తే షాకవుతారు

www.mannamweb.com


భారతదేశంలో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన ధ్రువీకరణ పత్రంగా మారింది. ఏ పనికైనా ఆధార్ కార్డు ఆధారమైందని చెబితే అతిశయోక్తి కాదేమో. ఏదైనా పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లాలన్నా, హోటల్‌లో చెక్ ఇన్ చేయాలన్నా, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టీటీకి గుర్తింపు ప్రూఫ్ చూపించాలన్నా ఇలా అన్ని చోట్లా ఉపయోగపడుతుంది. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఆధార్ కార్డులో మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి ముఖ్యమైన వివరాలను కలిగి ఉంటుంది. ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఆధార్ మోసగాళ్ల చేతిలో పడితే అది దుర్వినియోగం కావచ్చు. అందువల్ల అటువంటి పరిస్థితిని నివారించడానికి, ఆధార్‌ను సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డును ఏం చేయాలో? ఎప్పుడైనా ఆలోచించారా? మరణించిన వారి ఆధార్ కార్డును సరెండర్ చేయాలా? లేదా డీయాక్టివేట్ చేయాలా? అనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ద్వారా ఆధార్ కార్డు జారీ చేస్తారు. అయితే వయస్సుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డును జారీ చేస్తారు. అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ కార్డును సరెండర్ చేయడం లేదా మూసివేయడం గురించి ఇంకా ఎటువంటి నియమాలు రూపొందించలేదు. అంటే కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత, మీరు అతని ఆధార్ కార్డును సరెండర్ చేయలేరు లేదా రద్దు చేయలేరు. అయితే ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచడానికి యూఐడీఏఐ అందించే ఆధార్ లాక్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా మీకు కావాల్సిన వారి ఆధార్ సురక్షితంగా ఉంచడమే కాకుండా దానిని ఎవరూ దుర్వినియోగం చేయలేరు. ఆధార్ కార్డును దానిని ఉపయోగించడం కష్టం అవుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, అది దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి మీరు అతని/ఆమె ఆధార్ కార్డును లాక్ చేయవచ్చు.