నేటి ఆధునిక జీవనశైలిలో ప్రిడ్జ్ ప్రతి ఇంటిలో ఒక ముఖ్యమైన అవసరంగా మారింది. ఇది ఆహారాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడటమే కాదు.. పండ్లు, కూరగాయలు వంటి వాటిని తాజాగా ఉంచేందుకు సహాయపడుతుంది.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో రిఫ్రిజిరేటర్ ఉంచడానికి సరైన దిశ ఉందని మీకు తెలుసా? రిఫ్రిజిరేటర్‌ను తప్పు దిశలో ఉంచితే అది కుటుంబ సభ్యుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మన జీవితంలో సానుకూల శక్తిని తీసుకురావడంలో వాస్తు శాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో రిఫ్రిజిరేటర్ ఎక్కడ ఉంచాలో ఈ రోజు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఏ దిశలో రిఫ్రిజిరేటర్ ఉంచాలంటే
వాస్తు శాస్త్రం శక్తి సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. ఇంటిలోని ప్రతి దిశలో, మూలలో దానిలో ఉంచబడిన ప్రతి వస్తువులో ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది. అది ఇంటి నివాసితులను ప్రభావితం చేస్తుంది. ఇంట్లో అతి ముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడేది వంటగది. ఇది ఆహారాన్ని తయారు చేసే ప్రదేశం మాత్రమే కాదు ఇంటి సభ్యుల ఆరోగ్యానికి కేంద్రం కూడా. కనుక ఈ వంట గదిని, దీనిలో పెట్టే వస్తువులను వాస్తు సూత్రాల ప్రకారం దానిని ఏర్పాటు చేసుకోవాలి. చల్లదనం, నిశ్చలతకు ప్రతీక అయిన రిఫ్రిజిరేటర్‌ను వంటగదిలో సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం.
రిఫ్రిజిరేటర్ ఉంచడానికి ఉత్తమ దిశ ఏది?
- వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం వంటగదిలో రిఫ్రిజిరేటర్ ఉంచడానికి ఉత్తమ దిశ ఆగ్నేయం.
- ఈ దిశను అగ్ని కోణం అని కూడా పిలుస్తారు. ఇది శక్తి , సానుకూలతను సూచిస్తుంది.
- ఈ దిశలో రిఫ్రిజిరేటర్ ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం , శ్రేయస్సు ఉంటాయి. ఆహారం ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.
- అంతేకాదు రిఫ్రిజిరేటర్ ఉంచడానికి వాయువ్య దిశ కూడా మంచి ఎంపిక కావచ్చు.
- వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలలో రిఫ్రిజిరేటర్‌ను పొరపాటున కూడా పెట్టవద్దు. ఎందుకంటే ఈ దిశలో బరువైన వస్తువులు పెట్టడం నిషేధం.
- ఈశాన్య దిశను దేవతల స్థానంగా భావిస్తారు. రిఫ్రిజిరేటర్‌ను ఇక్కడ ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రవాహానికి దారితీస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
- అదే విధంగా ఇంట్లో నైరుతి దిశలో కూడా పెట్టవద్దు. రిఫ్రిజిరేటర్‌ను ఈ దిశలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు పెరుగుతాయి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
































