అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు సముద్రంలోనే ఎందుకు దిగుతారో తెలుసా..?

 యాక్సియమ్-4 మిషన్ విజయవంతం కావడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా భారత వ్యోమగామి శుభాంశూ శుక్లాతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమ్మీదకు తిరిగొచ్చారు.


వారి వ్యోమనౌక సముద్రంలో సురక్షితంగా దిగడం చూసి యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది. అయితే, ఈ దృశ్యం కొందరిలో పలు సందేహాలను కూడా రేకెత్తించింది. డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ సముద్రంలోనే ఎందుకు ల్యాండయ్యిందీ అనేది జనాల మదిలో మెదిలిన ప్రశ్న. పునర్వీనియోగ రాకెట్స్‌ నేల మీద దిగుతున్న వేళ ఈ ప్రశ్న తలెత్తడంలో వింత ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. సముద్రంపై ల్యాండింగ్‌ వెనక పలు ముఖ్య కారణాలు ఉన్నాయని అంటున్నారు (Axiom-4 Astronaut Sea Landing Reasons).

ఆస్ట్రొనాట్స్ ప్రయాణించే స్పేస్ క్యాప్సూల్స్‌ను సముద్రంపై దించడం వారి భద్రత దృష్ట్యా అవసరం. వ్యోమనౌకలు అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించే ముందు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, పీడనాలకు లోనవుతాయి. ఈ స్థితిలో వీటిని సముద్రంలో దించడం సాంకేతిక కారణాల రీత్యా సులభం. జనసాంద్రత ఎక్కువగా ఉండే నేలమీద కంటే అపార జలరాశిలో వ్యోమనౌకను ల్యాండ్ చేస్తే ఎవరికీ ఎలాంటి అపాయం ఉండదు. వ్యోమనౌక కిందకు వచ్చే సమయంలో కాస్త అదుపు కోల్పోయినా వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు చేర్చొచ్చు.

డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ వంటి వ్యోమనౌకలను నెమ్మదిగా భూమ్మీదకు దించేందుకు పారాషూట్‌లను వినియోగిస్తారు. దీనికి తోడు, వీటి ల్యాండింగ్ నీటిపై సున్నిత విధానంలో జరుగుతుంది కాబట్టి వ్యోమగాములకు ఎలాంటి అపాయం ఉండదు.

సముద్రంలో ల్యాండయిన స్పేస్ క్రాఫ్ట్‌ను సురక్షితంగా నేలపైకి తరలించడం కూడా సులభమే. ఇందుకు చాలా దేశాల్లో నేవీ సహకారం అందిస్తుంది. భారత్ ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపిన క్యాప్సూల్‌ను కూడా నావికాదళ సిబ్బంది సహకారంతోనే సముద్రం నుంచి నేల పైకి తీసుకొచ్చారు.

ఇలాంటి వ్యోమనౌకలను నేల మీద సురక్షితంగా దించాలంటే అనేక ఏర్పాట్లు చేయాలి. స్పేస్ క్రాఫ్ట్ లాండింగ్‌కు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. జనాలు, భవనాలకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ ల్యాండింగ్ కోసం అనేక ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక, ల్యాండింగ్ సమయంలో అనుకోని పొరపాట్లు జరిగితే క్యాప్సూల్ డ్యామేజ్ అయ్యి వ్యోమగాములు అపాయంలో పడే అవకాశాలు ఎక్కువ.

ఇలా వివిధ కారణాల రీత్యా వ్యోమగాములున్న స్పేస్ క్యాప్సూల్స్‌ను సముద్రంపై దించేందుకు శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇక భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ మిషన్‌కు కూడా సముద్రంపై ల్యాండింగ్‌ను ఎంచుకున్న విషయం తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.