సాధారణం వంటింట్లో ఉండే కొన్ని వస్తువులకు పురుగులు పడుతుంటాయి. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా బియ్యం, పిండి, రవ్వ వంటి వస్తువులకు త్వరగా పురుగు పడుతుంటుంది.
అయితే పిండిని సక్రమంగా భద్రపర్చుపోవడంవల్ల పురుగులు పడుతుంటాయి. అలా జరగకూడదంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
గ్రైడింగ్ చేయడానికి ముందు ధాన్యాలను కడగాలి:
ముఖ్యంగా జొన్నలు, తైదలు వంటి పిండి వస్తువులకు త్వరగా పురుగు పడుతుంటుంది. జొన్నలు, తైదలు ఇలా ఏ ధాన్యాలైనా పిండిగా మార్చడానికి గ్రైడింగ్ చేస్తుంటారు. కొందరు మార్కెట్ నుంచి తెచ్చిన వాటిని బాగానే ఉంటాయని గమనించి నేరుగా గ్రైడింగ్ చేసే మిషన్ వద్దకు తీసుకెళ్తుంటారు. దీనివల్ల పిండికి పురుగులు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలా పురుగు పట్టకూడదనుకుంటే ముందుగా వాటిని నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత మాత్రమే పిండి పట్టించాలని, లేకపోతే ఫంగస్ పేరుకుపోయి పిండి త్వరగా పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు.
పిండిని, ముఖ్యంగా తైద పిండిని ఏదైనా పాత్రలో లేదా కంటైనర్‌లో పెట్టినప్పుడు గాలి తగలకుండా దానికి జాగ్రత్త పడాలి. సరిగ్గా పెట్టకపోయినా, తేమ చేరే పరిస్థితిలో ఉంచినా పురుగులు పడతాయి. గాలి చొరబడే కంటైనర్‌లో ఉంచడంవల్ల ఆక్సీకరణ పెరిగి పిండి మరింత త్వరగా పాడవుతుందని గమనించండి.
తక్కువ ఉష్ణోగ్రతలో భద్రపర్చాలి
వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో జొన్న, గోధుమ ఇలా ఏదైనా పిండిని పెట్టడంవల్ల త్వరగా పురుగులు పడుతుంది. ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే కంటైనర్‌లో వేసి, మూత పెట్టిన తర్వాత ఒకే విధమైన సాధారణ ఉష్ణోగ్రత ఉండే ప్రదేశంలో లేదా చల్లని ప్రదేశంలో ఉంచడం ఉత్తమం. అలా కాకుండా కాసేపు చల్లగా, మరి కాసేపు వేడిగా మారే వాతావరణంలో ఉంచితే పాడవుతుంది. అలాగే గదిలో కిటికీల పక్కన స్టోర్ చేయడంవల్ల కూడా కిటికిల్లోంచి బయటి వాతావరణం కారణంగా పాడయ్యే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రత ఉండే ప్రదేశంలో ఉంచడం మంచిదంటున్నారు. ఈ విధమైన జాగ్రత్తలతో పిండికి పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు వినియోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పిండి ఏదైనా సరే పురుగు పట్టకుండా ఉండటానికి గాలిచొరబడని డబ్బాల్లో నిల్వ చేయడం మంచిది. ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటే గాలిచొరబడని డబ్బాలో పెట్టి డీప్ ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. దినుసులను సాధ్యమైనంత వరకు గాజు సీసాల్లోనే భద్రపరుచుకోవాలి.
బియ్యాన్నీ తేమ తగలకుండా ఉండేలా చూడాలి. గాలి ఏ మాత్రం చొరబడని గాజు కంటైనర్స్ లేదా స్టీలు డబ్బాల్లో నిల్వ చేసుకోవడం మంచిది.
బియ్యం నిల్వ చేసిన డబ్బాలో బిర్యానీ ఆకులు లేదా వేపాకులు వేస్తే పురుగు పట్టకండా ఉంటుంది.
పిండి, బియ్యం డబ్బాలను పొడిగా, చీకటిగా ఉండే ప్రదేశంలో ఉంచడం ఉత్తమం. అలాగే సూర్యరశ్మి పడే చోట పెట్టకపోవడం మంచిదంటున్నారు. సబ్బులు, డిటర్జెంట్, ఉల్లిపాయలు.. ఇలా ఇతర పదార్థాలతో కలపవద్దు
గోధుమలు, సెనగలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను కలపాలి.
బిర్యానీ ఆకుల మాదిరిగానే, ఎండు మిరపకాయను కూడా పిండి కంటైనర్‌లో ఉంచవచ్చు. ఎండు మిరపకాయను పిండి పాత్రలో ఉంచడం వల్ల కీటకాలు పిండిలోకి రాకుండా ఉంటాయి. ఇది పిండి నుండి కీటకాలను దూరం చేస్తుంది.
ఇది కాకుండా, పురుగుల నుండి రక్షించడానికి పిండిలో ఉప్పు కలపండి. ఉప్పు కలపడం ద్వారా కీటకాలు పారిపోతాయి. కీటకాలు మళ్లీ పిండిలోకి ప్రవేశించవు. మీ పిండి పూర్తిగా తాజాగా ఉంటుంది.