మెజార్టీ ప్రజలు బ్రేక్‌ఫాస్ట్‌గా దోశలు తింటుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది అమ్మలు వారానికి సరిపడా పిండిని సిద్ధం చేసుకుంటారు. ఒక్కసారి పిండి రుబ్బుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. అయితే చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో పిండి పులిసే ప్రక్రియ వేగంగా ఉంటుంది. ఉష్ణోగ్రతల కారణంగా పిండి తొందరగా పులుస్తుంది. కాబట్టి పిండి తయారు చేసుకునే సమయంలో ఈ పదార్థాలు కలిపితే తొందరగా పులియదని, పైగా దోశల రుచి కూడా బాగుంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కొబ్బరి పాలు: బియ్యం, మినప్పప్పును గ్రైండ్ చేసేటప్పుడు కొబ్బరి పాలు లేదా కొబ్బరి పొడి కలపాలని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల పిండి తొందరగా పులుపు ఎక్కదని అంటున్నారు.
ఐస్‌క్యూబ్స్: పిండిని గ్రైండ్ చేసుకునే సమయంలో ఐస్‌క్యూబ్స్ వేయడం వల్లనూ పిండి త్వరగా పులియదని, రుచి కూడా బాగుంటుందని చెబుతున్నారు.
ఎగ్‌వైట్: గుడ్డులోని తెల్లసొన కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. అందుకోసం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు గుడ్డులోని తెల్లసొనను వేసి రుబ్బుకుంటే దోశలు రుచిగా వస్తాయని, పైగా పులుపు ఎక్కదని అంటున్నారు.
చక్కెర: వంటల్లో తీపి కోసం ఉపయోగించే పంచదార, దోశలు పులుపు ఎక్కకుండా ఉండేందుకు సహాయపడుతుందని అంటున్నారు. అందుకోసం పిండిని గ్రైండ్ చేసే సమయంలోనైనా లేదంటే రుబ్బుకున్న తర్వాత అయినా పంచదారను కలిపితే మంచిదంటున్నారు.
ఈ టిప్స్ కూడా:
ఎండాకాలంలో పిండిని గది ఉష్ణోగ్రత వద్దే ఎక్కువ సేపు ఉంచితే త్వరగా పులిసిపోతుంది. కాబట్టి గ్రైండ్ చేసిన తర్వాత ఓ రెండు గంటలు బయట ఉంచి, ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుందని అంటున్నారు.
ఉప్పు తక్కువగా కలపాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఉప్పు తక్కువగా వేస్తే నెమ్మదిగా పులుస్తుందని, ఎక్కువగా వేస్తే వేగంగా పులిసిపోతుందని చెబుతున్నారు.
మోతాదుకు మించి మినప్పప్పు వాడినా పిండి అధికంగా పులిసే అవకాశం ఉంటుందట. కాబట్టి దీన్ని సరిపడే విధంగా చూసుకోవాలని చెబుతున్నారు.
పిండి పుల్లగా మారితే ఈ టిప్స్:
బియ్యం పిండి లేదా ఉప్మా రవ్వ: ఒకవేళ ఎండాకాలంలో దోశ పిండి బాగా పులిసి పుల్లగా మారితే పడేయాల్సిన అవసరం లేకుండా ఈ టిప్స్ పాటిస్తే సరి. అందుకోసం పిండిలో కొద్దిగా బియ్యం పిండి లేదా ఉప్మారవ్వను కలిపితే పులుపు తగ్గుతుందని అంటున్నారు.
అల్లం పచ్చిమిర్చి పేస్ట్: ఈ పేస్ట్ కూడా పిండిలో పులుపుదనాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం మిక్సీజార్‌లోకి అల్లం, పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పిండిలో కలపాలి. దీని వల్ల దోశల రుచి కూడా పెరుగుతుంది.