రథసప్తమి నాడు ఈ పనులు చేస్తే సంపద, దీర్ఘాయువు!!

సూర్యభగవానుడి ఆరాధనకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి ముఖ్యమైనది. మాఘ మాసంలోని శుక్లపక్ష సప్తమి నాడు రథ సప్తమి నిర్వహించబడుతుంది.
దీనినే ఆరోగ్య సప్తమి, అచల సప్తమి, సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రథసప్తమి నాడు సూర్యభగవానుని పూజించడం వల్ల అయన కరుణ పుష్కలంగా ఉండి, అనారోగ్యాల బారిన పడకుండా జీవించడానికి, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.


రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచం మొత్తం పైన తన కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని చాలామంది బాగా నమ్ముతారు. ఇక రథసప్తమి నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాలు, బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.

 

ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. పంచాంగం ప్రకారం మాఘ మాసంలోని శుక్లపక్ష సప్తమి తిధి ఫిబ్రవరి 15వ తేదీన గురువారం ఉదయం పదిగంటల నుంచి మొదలై 16వ తేదీన ఉదయం ఎనిమిది గంటల 54 నిమిషాలకు ముగుస్తుంది .అయితే ఫిబ్రవరి 16వ తేదీన ఉదయాన తిథి ఆధారంగా రథసప్తమి ని జరుపుకుంటారు.

ఇక రథసప్తమి పర్వదినాన ముఖ్యంగా చేయవలసిన పనుల విషయానికి వస్తే ఆరోజు దానధర్మాలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. సూర్యుడు దానధర్మాలు చేస్తే ప్రసన్నుడు అవుతాడని, రథసప్తమి నాడు నిరుపేద బ్రాహ్మణులకు పప్పు, బెల్లం, గోధుమలు, రాగి, ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాన్ని దానం చేయాలని చెబుతున్నారు.

ఆరోజు ఉదయాన్నే నదీ స్నానము ఆచరించి, సూర్యుణ్ణి పూజించి, ఉపవాస దీక్షతో, దానధర్మాలు చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయని, ఏడేడు జన్మల పాపాలు తొలగిపోయి, పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించడం వల్ల దీర్ఘాయువు, సంపదతో పాటు కుటుంబ ఆనందం లభిస్తాయని చెప్తున్నారు. ఈసారి రథ సప్తమి నాడే బ్రహ్మయోగం, భరణి నక్షత్రం ఉన్నాయి. ఈ రోజు ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. MannamWeb దీనిని ధృవీకరించలేదు.