జ్వరానికి వేసుకునే Dolo 650 ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్..?

www.mannamweb.com


డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా సమాచారం వేగంగా ప్రజలకు చేరువ అవుతోంది. అయితే కొన్నిసార్లు తప్పుడు సమాచారం వైరల్ అవుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది.
ఈమధ్య సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకటన ఒకటి సర్క్యులేట్ అవుతోంది. డోలో 650 (పారాసెటమాల్) ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మందు అని, ఏకంగా 40 దేశాల పరిశోధకులు దీన్ని హానికరమని తేల్చారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా డేంజరస్‌ అని ఆరోపించారు. అయితే నిజంగానే పారాసెటమాల్ అంత ప్రమాదకరమా? ఈ వాదనలో నిజం ఎంతో తెలుసుకుందాం.

బెనిఫిట్స్ ఇవే
డోలో 650 (పారాసెటమాల్) టాబ్లెట్ జ్వరాన్ని తగ్గించడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు నొప్పుల నుంచి రిలీఫ్ కలిగిస్తుంది. అందుకే తలనొప్పి, బాడీ పెయిన్స్, నెలసరి నొప్పులు, ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పులు.. ఇలాంటి సాధారణ సమస్యలన్నిటికీ డాక్టర్లు దీన్ని సిఫార్సు చేస్తారు. అంతేకాదు, ఫ్లూ, డెంగీ, వైరల్ ఇన్ఫెక్షన్ల సమయంలో వచ్చే జ్వరాన్ని తగ్గించడానికి కూడా దీన్ని రిఫర్ చేస్తారు.

డోలో 650 ఎక్కడైనా సులభంగా దొరుకుతుంది. ఐబుప్రోఫెన్ (Ibuprofen), ఆస్పిరిన్ లాంటి మందులతో పోలిస్తే దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. ఖాళీ కడుపుతో తీసుకుంటే మరీ తొందరగా పనిచేస్తుంది. అయితే, కొందరికి కొంచెం కడుపులో ఇబ్బందిగా అనిపించవచ్చు. సరైన మోతాదులో తీసుకుంటే పెద్దవాళ్లకు, పిల్లలకు కూడా ఇది సురక్షితమే.

సైడ్ ఎఫెక్ట్స్
పారాసెటమాల్ సరిగ్గా వాడకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి. కొందరికి వికారం, తల తిరగడం, వంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కానీ, మోతాదుకు మించి పారాసెటమాల్ తీసుకుంటే లివర్‌ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, ఇది చాలా సీరియస్ కావచ్చు. ఆల్కహాల్ తీసుకునే వారికి ఈ రిస్క్ ఇంకా ఎక్కువ. అందుకే, ప్యాకెట్‌పై రాసి ఉన్న మోతాదులో లేదా డాక్టర్ చెప్పినట్టు మాత్రమే వాడాలి.

పారాసెటమాల్‌ మోస్ట్ డేంజరస్ డ్రగ్?
డోలో 650ని ‘మోస్ట్ డేంజరస్ డ్రగ్’ (World’s Most Dangerous Drug) అని ఎవరూ అనలేదు. ఇది పూర్తిగా అవాస్తవం. ఈ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని అత్యవసర మందుల (Essential medicines) లిస్టులో చేర్చింది. ఎందుకంటే ఇది సురక్షితమైనది, బాగా పనిచేస్తుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వాడే సురక్షితమైన మందుల్లో పారాసెటమాల్ ఒకటని చెప్పింది.

నిపుణులు ఏమంటున్నారు?
ముంబైకి చెందిన ప్రముఖ వైద్యులు డా. కశ్యప్ దఖిని, ‘ఏక్ ఝలక్ ఇంగ్లీష్‌’ పోర్టల్‌తో మాట్లాడుతూ, జ్వరాన్ని తగ్గించడానికి పారాసెటమాల్ చాలా సురక్షితమైన మందుల్లో ఒకటని చెప్పారు. ఐబుప్రోఫెన్ లాంటి ఇతర మందులు ఎక్కువ వాడితే కడుపు, కిడ్నీలు, లివర్‌కు హాని చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పారాసెటమాల్‌ను సరైన మోతాదులో ఎవరైనా వాడొచ్చని, కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే లివర్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఢిల్లీకి చెందిన డా.ఉబైద్ ఉర్ రెహమాన్ సూచించారు.పెద్దవాళ్లు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు.. ఎవరైనా డాక్టర్ సలహాతో డోలో 650 వాడొచ్చు. ఏవైనా డౌట్స్ ఉంటే, తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

ఫ్యాక్ట్ చెక్
మొత్తానికి ‘డోలో 650 ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మందు’ అనేది పచ్చి అబద్ధం. నొప్పి, జ్వరం తగ్గించే బెస్ట్ పారాసెటమాల్‌ డ్రగ్ ఇది. అందుకే సోషల్ మీడియా పుకార్లను కాకుండా, నిజమైన సమాచారం, వైద్యుల సలహాలను మాత్రమే నమ్మాలి.