అమరావతికి బిగ్ షాక్-రుణం ఇవ్వొద్దంటూ ప్రపంచ బ్యాంక్ కు మరో ఫిర్యాదు.

www.mannamweb.com


ఏపీ రాజధాని అమరావతికి బాలారిష్టాలు తప్పడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైనా మధ్యలో వైసీపీ సర్కార్ రావడంతో ఐదేళ్లుగా అక్కడ పనులు నిలిచిపోయాయి.

అదే సమయంలో అమరావతికి గతంలో ప్రపంచ బ్యాంక్ ఇవ్వాల్సిన రుణాన్ని అడ్డుకునేలా అందిన ఫిర్యాదులతో అది కూడా ఆగిపోయింది. చివరకు మళ్లీ ప్రపంచ బ్యాంక్ ను ఒప్పించి తిరిగి రుణానికి ఆమోదముద్ర వేయించుకున్న కూటమి సర్కార్ కు మరో షాక్ తప్పలేదు.

అమరావతికి గతంలో ఏడీబీతో కలిసి రూ.3500 రుణం ఇచ్చేందుకు సిద్దమైన ప్రపంచ బ్యాంక్.. ఇక్కడ రైతుల నుంచి భూములు అక్రమంగా తీసుకున్నారన్న ఫిర్యాదులతో వెనక్కి తగ్గింది. ముఖ్యంగా కేంద్రం భూసేకరణ చట్టం అమల్లో ఉండగా.. ఇక్కడ రైతుల నుంచి భూసమీకరణ పేరుతో మరో చట్టం తెచ్చి అప్పటి చంద్రబాబు సర్కార్ భూములు తీసుకుందనే ఫిర్యాదులు ప్రపంచ బ్యాంక్ కు అందాయి.

అలాగే అమరావతి రాజదాని కృష్ణానది వరద ముంపు ప్రాంతంలో ఉందనే ఫిర్యాదూ రావడంతో ప్రపంచ బ్యాంక్ క్షేత్రస్ధాయిలో పర్యటించింది. రైతులతో మాట్లాడాక అలాంటిదేమీ లేదని తేల్చి రుణం ఇచ్చేందుకు సిద్దమైనా జగన్ సర్కార్ వద్దని చెప్పేసింది. దీంతో ప్రపంచ బ్యాంక్ అమరావతికి రుణ ప్రతిపాదనను విరమించుకుంది. ఇప్పుడు మరోసారి దాదాపు ఇలాంటి కారణాలతోనే మరో ఫిర్యాదు అందింది.

అపరిచిత వ్యక్తుల పేరుతో ప్రపంచ బ్యాంక్ కు ఈ ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా అమరావతి రాజధానికి రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో ఈ నెల 18న ప్రపంచ బ్యాంక్ కు ఈ ఫిర్యాదు అందింది. ఇందులో చంద్రబాబు సర్కార్ భూసమీకరణ చట్ట విరుద్దమని తెలిపారు. దీని వల్ల అమరావతి రైతులు జీవన ఉపాధి, ఆహార భద్రత కోల్పోయారన్నారు. అలాగే రాజధాని నిర్మాణంతో పర్యావరణ, సామాజిక, ఆర్ధిక సమస్యలు తప్పవని తెలిపారు. దీంతో ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే ఆమోదించిన ప్రతిపాదనపై ఏం చేయబోతోందన్న చర్చ మొదలైంది.